పరారీలోని నిందితునికి బెయిల్‌ ఇవ్వొద్దు : సుప్రీం కోర్టు

Update: 2021-10-22 06:40 GMT
పరారీలో ఉన్న నిందితునికి, అపరాధిగా పేర్కొంటూ ప్రకటన విడుదలయిన వ్యక్తికీ ముందస్తు బెయిల్‌ ఇవ్వకూడదని గురువారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మోసం చేసిన కేసులో ఈ వర్గంలోకి వచ్చిన నిందితునికి ముందస్తు బెయిల్‌ ఇస్తూ పట్నా హైకోర్టు జారీచేసిన ఆదేశాలను తోసిపుచ్చుతూ పై విషయాన్ని తెలిపింది. ఇచ్చిన వారెంట్లను తీసుకోకపోతే భారత నేర స్మృతిలోని సెక్షన్‌ 82 కింద నిందితుడిని అపరాధి అని కోర్టు ప్రకటన విడుదల చేస్తుంది. అలాంటి ప్రకటన వచ్చినప్పుడు సెక్షన్‌ 83 కింద ఆ అపరాధి ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు.

నిందితునికి కిందికోర్టు ఈ రెండు సెక్షన్లను వర్తింపజేసినా పట్నా హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఇవ్వడం తగదని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదం వల్ల మోసం కేసు నమోదయిందని, ఆ దృష్ట్యా బెయిల్‌ ఇవ్వవచ్చని హైకోర్టు అభిప్రాయపడడం సరికాదని తెలిపింది. నీట్‌-యూజీలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించాలన్న వ్యాజ్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చివరకు అది గందరగోళానికి దారితీస్తుందని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సెప్టెంబరు 12న జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ పలు చోట్ల కేసులు నమోదయ్యాయని, అందువల్ల వీటిపై నిజానిజాలను నిర్ధారించేలా దర్యాప్తు చేయించాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. తాము పరీక్షలను రద్దు చేయాలని కోరడం లేదని, అక్రమాలను వెలుగులోకి తేవాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. అయితే ఇందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు.
Tags:    

Similar News