3 రాజధానులపై ఏపీ సర్కార్ కు సుప్రీం షాక్

Update: 2020-08-26 09:50 GMT
మూడు రాజధానుల ఏర్పాటు దిశగా ఏపీలో వైసీపీ సర్కార్ వేగంగా అడుగులు వేస్తున్న వేళ సుప్రీం కోర్టు షాకిచ్చింది. తాజాగా ఏపీ 3 రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను రద్దు చేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్ ను ఈరోజు విచారించిన సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనను సుప్రీం కోర్టు నిరాకరించింది. హైకోర్టు విచారణ చేస్తున్నందున ఈ దశలో తాము ఏపీ 3 రాజధానుల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. మూడు రాజధానుల వ్యవహారంపై గురువారం హైకోర్టులో విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

నిర్ణీత గడువులోపు హైకోర్టులో విచారణ ముగించేలా ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరగా.. దాన్ని కూడా తాము ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును హైకోర్టు త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొంది.

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం 3 రాజధానులపై పెట్టుకున్న ఏ అభ్యర్థనను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర హైకోర్టుదే నిర్ణయాధికారం అని పేర్కొనడంతో ఏపీ సర్కార్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. హైకోర్టు స్టే ఎత్తివేయడానికి సుప్రీం కోర్టు నో చెప్పింది.
Tags:    

Similar News