రామోజీరావుకు సుప్రీం కోర్టు నోటీసులు.. మార్గదర్శి కేసు ముందుకేనా...?

Update: 2022-09-19 16:41 GMT

మార్గదర్శి కేసులో ఈనాడు అధినేత రామోజీరావుకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాలలోగా తన వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. మార్గదర్శిలో నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారు అన్న దాని మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. గత నెలలో దీనికి సంబంధించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.

దేంతో ఈ రోజున సుప్రీం కోర్టు దీనికి సంబంధించి కేసుని విచారించింది. రామోజీరావుకు నోటీసులు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ నిబంధలకు విరుద్ధంగా హిందూ అవిభాజ్య కుటుంబం డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట రామోజీవారు అలా చేస్తున్నారు అంటూ ఆరోపిస్తూ మాజీ ఎంపీ చాలా కాలం క్రితమే కోర్టుకు వెళ్లారు. అయితే ఉమ్మడి ఏపీ హై కోర్టు రెండుగా విడిపోతున్న క్రమంలో చివరి రోజున‌ ఈ కేసుని హై కోర్టు కొట్టేసింది.

దాన్ని సవాల్ చేస్తూ ఉండవల్లి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కావడంతో ఈ కేసు విచారణ మొదలైంది. అంతే కాదు సుప్రీం కోర్టు లో ఈ కేసు మీద డిపాజిట్లు సేకరించడం నేరమా కాదా అన్న దాని మీద కూడా విచారణ జరగబోతోంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు ఉన్నా కూడా తోసిరాజని 2,600 కోట్ల రూపాయలను మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరిట రామోజీరావు సేకరించారని ఉండవల్లి తన పిటిషన్ లో ఆరోపించారు.

నిబంధలను ఉల్లఘించిట్లుగా రుజువు అయితే ఇంతకు రెండున్నర రెట్ల మొత్తం జరీమానాగా అంటే ఏడున్న వేల పై చిలుకు సొమ్ము కడుతూ రెండేళ్ల జైలు శిక్ధ కూడా బాధ్య్లు అనుభవించాల్సి ఉంటుంది. ఈ కేసులో అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఉండవల్లి చెబుతున్నారు. పైగా డిపాజిట్లకు నష్టం లేకుడా సొమ్ము అంతా తాము చెల్లించినట్లుగా రామోజీరావు చెబుతున్నారని, అది కరెక్ట్ కాదని, ఆ వివరాలు మొత్తం చూసి చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అయినా లేక కోర్టు నియమించిన అధారిటీ అయినా అయి ఉండాలని ఆయన అంటున్నారు.

తొందరలో ఆ దిశగా కూడా కోర్టు డైరెక్షన్ ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు విచారణలో తాము అందరి డిపాజిట్ దారులకు సొమ్ము చెల్లించేశామని మార్గదర్శి తరఫున న్యాయవాదులు కోర్టుకు చెప్పారు. అయితే ఈ విషయంలో తమకు అవకాశం ఇవ్వాలని, మార్గదర్శికి సంబంధించి అన్ని డిపాజిట్లను పూర్తిగా  వెరిఫై చేయాల్సి ఉందని  ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు.

ఇక రామోజీరావు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఏపీ తెలంగాణా ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మరో నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఈ కేసు విషయంలో అన్ని విధాలుగా  లోతుపాతుల దాకా కధ నడుస్తుందని ఉండవల్లి అంటున్నారు. డిపాజిట్లు అవిభక్త హిందూ కుటుంబం సేకరించడం కరెక్ట్ అంటే దేశమంతా రేపు ఇదే పని  చేస్తారని, ఎవరికి వారు ఎగ్గొట్టిపోతారని, అపుడు పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.

అందువల్ల రామోజీరావు కేసు విషయంలో న్యాయం తప్పకుండా జరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఏ చట్టమైనా అందరికీ ఒక్కటే అన్న భావన ఉండాలని ఆయన అన్నారు. రామోజీరావే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి తెలంగాణా సీఎం కేసీయార్ కూడా దీని మీద తన పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏది న్యాయం, ఏది ధర్మం అన్నది ఆలోచించి  వేస్తారని భావిస్తున్నామని అన్నారు. మొత్తానికి మార్గదర్శి కేసు ప్రాసెస్ లో పడింది అని ఉండవల్లి అంటున్నారు. ఈ కేసులో చాలా విషయాలు బయటకు వస్తాయని కూడా అంటున్నారు. తన దగ్గర మొత్తం డిపాజిటర్ల జాబితా కూడా ఉందని ఆయన చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News