అమ‌రావ‌తి రాజ‌ధాని కేసుల విచార‌ణ మ‌రింత జాప్యం: సుప్రీం ఏమందంటే

Update: 2022-11-14 13:30 GMT
ఏపీ ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం, ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న‌.. రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి కేసుల విచార‌ణ మ‌రింత జాప్యం జ‌ర‌గ‌నుంది. రాష్ట్ర విభజన, రాజధాని అమరావతి కేసుల విచారణను విడివిడిగానే చేపడతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. రెండు కేసులను వేటికవే విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనూ సింఘ్వీ, మాజీ అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్ ధర్మాసనాన్ని కోరారు. హైకోర్టులో రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేశారని కేకే వేణుగోపాల్‌ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

ఈ దశలో జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ రుషికేశ్‌ రాయ్‌ల ధర్మాసనం జోక్యం చేసుకుంది. సుప్రీం కోర్టులో విచారణ పూర్తయ్యే వరకు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లపై రైతులు ఒత్తిడి తీసుకురాకపోవచ్చని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించే అధికారం లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రభుత్వం తరఫు న్యాయవాది వైద్యనాదన్‌ ధర్మాసనానికి వివరించారు. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని ఆయన కోరగా.. ఈ నెల 28నే అన్ని అంశాలను పరిశీలిస్తామని ధర్మాసనం ప్రకటించింది.

వాస్త‌వానికి ఇప్ప‌టికే సుప్రీం కోర్టుకు ఈ కేసులు చేరి నెల రోజులు అయింది. మ‌రోవైపు.. సుప్రీం కోర్టు ఇచ్చే ఆదేశాల అనంత‌రం త‌మ పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని రైతులు నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వం కూడా సుప్రీం తీర్పును బ‌ట్టి మూడు రాజ‌ధానులపై అడుగులు ముందుకు వేయాల‌ని నిర్ణ‌యించుకుంది.

దీనికి సంబందించి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే, కేసులు సుప్రీంకోర్టులో విచార‌ణ‌లో ఉండ‌డంతో వెయిట్ చేస్తోంది. ఇక‌, రాష్ట్ర విభ‌జ‌న‌కు సంబంధించిన కేసులపై రెండు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో కేసుల వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News