కంప్ల‌యింట్ అవ‌స‌రం లేదు.. వారిని మూసేయండి: సుప్రీం ఆర్డ‌ర్‌

Update: 2022-10-21 15:39 GMT
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మతం పేరుతో మనం ఎక్కడికి పోతున్నాం? అంటూ ప్రశ్నించింది. మతంతో ప్రమేయం లేకుండా, ఫిర్యాదు(కంప్ల‌యింట్‌) కోసం వేచిచూడకుండా అపరాధులపై సుమోటో చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. విద్వేష పూరిత ప్రసంగాలు ముఖ్యంగా ప్రజాస్వామిక, మత-తటస్థ దేశానికి భంగమని కోర్టు అభిప్రాయపడింది.

అంతేకాదు.. విదేష వ్యాఖ్య‌ల‌ను వింటూ కూర్చుంటారా?  అని ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించింది. ''ఎవ‌రో వ‌స్తారు.. కంప్ల‌యింట్ ఇస్తారు.. అప్పుడు చూద్దాం.. చేద్దాం.. అని కూర్చుంటే.. మ‌రికొంద‌రు కూడా.. ఇలానే వ్యాఖ్య‌లు చేస్తూ.. పోతారు. ఇక‌, మ‌త సామ‌ర‌స్యం అనే రాజ్యాంగానికి అర్ధం ఏం ఉంటుంది?'' అని నిల‌దీసింది.

ఇలాంటి కేసుల్లో ఎవ‌రూ ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌భుత్వాలే నేరుగా చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని.. ఆదేశించింది. భార‌త్‌లోని చ‌ట్టాలు దానికి అనుమ‌తి ఇస్తున్నాయ‌ని తెలిపింది.

ఇండియాలోని ముస్లిం మతస్థులను లక్ష్యంగా చేసుకుని, భయభ్రాంతులను చేయడం ఎక్కువైందని, దీనిని నిలువరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్వేష ప్రసంగాలు చేయడం ''తీవ్రమైన అంశం''గా కోర్టు పేర్కొంది.

ఎవరో ఫిర్యాదు చేస్తారని ఎదురుచూడకుండా నిందితులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ యంత్రాగం జాప్యం చేసినట్లయితే దానిని కోర్టు థిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరించింది.

దేశ లౌకిక విధాన పరిరక్షణకు విద్వేష పూరిత ప్రసంగాలు ఎవరు చేసినా మత ప్రసక్తి లేకుండా సుమోటో చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షహీన్ అబ్దుల్లా అనే పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. తమ తమ పరిధిల్లో జరిగిన ఇలాంటి నేరాలపై (విద్వేషపూరిత ప్రసంగాలపై) ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ నివేదికను తమకు సమర్పించాలని ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News