గాలికి దిమ్మ తిరిగే షాకిచ్చిన సుప్రీం

Update: 2018-05-04 10:41 GMT
హోరాహోరీగా సాగుతున్న క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుది ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ వెలువ‌డిన అంచ‌నా ప్ర‌కారం ఏ పార్టీకి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసే ప‌రిస్థితి ఉండ‌ద‌ని చెబుతున్నారు. అనుకోని రీతిలో ఏదైనా జ‌రిగితే.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయొచ్చ‌ని.. అది కూడా స్వ‌ల్ప మెజార్టీతోనేన‌ని చెబుతున్నారు.

అయితే.. అప్పుడే ఆ నిర్ణ‌యానికి రావ‌టం స‌రికాద‌ని.. ప్ర‌ధాని మోడీ పూర్తిస్థాయి ప్ర‌చారం పూర్తి అయ్యాక మాత్ర‌మే అంచ‌నాకు రావ‌టం మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. బ‌ళ్లారి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో త‌న ప్ర‌భావాన్ని చాటే గాలి జ‌నార్ద‌న‌రెడ్డికి ఊహించని షాక్ సుప్రీం నుంచి ఎదురైంది.

అక్ర‌మ మైనింగ్ కేసులో జైలుకెళ్లిన గాలి.. ఆ మ‌ధ్య‌న అతి క‌ష్ట‌మ్మీద బెయిల్ మీద బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లోబీజేపీ త‌ర‌పు (ఓప‌క్క బీజేపీకి గాలితో సంబంధం లేద‌ని అమిత్ షా చెప్ప‌టం గ‌మ‌నార్హం)  ప్ర‌చారం చేయ‌టానికి అనుమతించాలంటూ గాలి పెట్టుకున్న పిటిష‌న్ ను ప‌రిశీలించిన సుప్రీం.. అది సాధ్యం కాద‌ని తేల్చింది. బ‌ళ్లారిలో ప‌ర్య‌టించేందుకు త‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌న్న గాలి విన‌తిని తోసిపుచ్చింది.  

ఎన్నిక‌ల్లో గాలి ప్ర‌చారం చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. గాలితో త‌మ‌కు సంబంధం లేద‌ని బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చెప్ప‌గా.. మ‌రోవైపు గాలి జ‌నార్ద‌న్ రెడ్డి సోద‌రుడు గాలి సోమ‌శేఖ‌ర్ రెడ్డితో క‌లిసి మోడీ ఎన్నిక‌ల ప్ర‌చార వేదిక‌ను పంచుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. గాలి జ‌నార్ద‌న‌రెడ్డికి టికెట్ ద‌క్క‌కున్నా.. ఆయ‌న అనుచ‌ర వ‌ర్గానికి భారీగా టికెట్లు ల‌భించాయి. ఈ నేప‌థ్యంలో త‌న స‌త్తాను చాటాల‌ని గాలి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల‌ని త‌పించారు.సుప్రీం తాజా ఆదేశంతో ఆయ‌న ఆశ‌లు నీరుకారిపోయాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News