చిన్నమ్మకు మరోసారి షాకిచ్చిన సుప్రీం

Update: 2017-02-15 07:14 GMT
చిన్నమ్మ టైం ఏ మాత్రం బాగోలేదు. సీఎం కుర్చీలో కూర్చోవాలన్న కోరిక తీరలేదు. భవిష్యత్తులో తీరే అవకాశం కనిపించని పరిస్థితి. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా మరోసారి.. సుప్రీం చేత మరో షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షను విధిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తాత్కాలిక నిలిపేలా వేసిన దరఖాస్తుపై అత్యున్నత న్యాయస్థానం షాకిచ్చింది.

తాను అనారోగ్యంతో ఉన్నానని.. లొంగిపోయేందుకు నాలుగు వారాల సమయం తనకు ఇవ్వాల్సిందిగా శశికళ చేసిన అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. ఆమెను వెంటనే కోర్టులో లొంగిపోవాలని సూచించింది. తీర్పులో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసిన సుప్రీం.. వెను వెంటనే లొంగిపోవాలంటూ తేల్చి చెప్పింది.

దీంతో.. ఇప్పటికిప్పుడు లొంగిపోయే పరిస్థితి శశికళకు తప్పదని చెప్పాలి. అదాయానికి మించి ఆస్తుల కేసులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాటు ఏ2గా ఉన్న శశికళకు నాలుగేళ్ల జైలుశిక్షను విధిస్తూ సుప్రీంకోర్టు నిన్నతీర్పు ఇవ్వటం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. నాలుగువారాల సమయాన్ని కోరటం ద్వారా.. పార్టీ వ్యవహారాలన్ని చక్కబెట్టుకోవాలని శశికళ భావించింది. ఆరోగ్య కారణాలతో సుప్రీం తలుపు తట్టిన ఆమెకు.. సుప్రీం సానుకూలంగా స్పందిస్తుందన్న దింపుడు కళ్లెం ఆశను చిన్నమ్మ పెట్టుకున్నారు. తాజాగా సుప్రీం స్పందనతో ఆమె వెనువెంటనే లొంగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News