చిన్నమ్మ నోటి నుంచి జైలుమాట మర్మమేంది?

Update: 2017-02-13 14:53 GMT
కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అస్సలు సూట్ కావు. రేపోమాపో సీఎం అయ్యేందుకు ఎత్తులమీద ఎత్తులు వేస్తున్న చిన్నమ్మ.. ఇప్పుడా విషయం కంటే కూడా.. జైలు జీవితం మీదా.. తన జీవితంలో తానుపడిన కష్టాల గురించి అదే పనిగా మాట్లాడిన తీరుపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఓపక్క పన్నీర్ పై విరుచుకుపడుతున్న ఆమె.. మరోవైపు తన మీద తిరుగుబాటు చేసిన వారిని ఉతికి ఆరేయటానికి బదులుగా..జైలు జీవితం తనకు కొత్త కాదని చెప్పటం వెనుక మర్మం ఏమిటన్న వాదన ఆసక్తికరంగా మారింది.

అమ్మ మీద ఉన్న అక్రమాస్తుల కేసులో శశికళ ఏ2గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఆ తీర్పు కారణంనే.. శశికళ చేతికి సీఎం పగ్గాల్ని అప్పగించాల్సిన గవర్నర్.. వెనక్కి తగ్గేలా చేసింది. దీంతో.. సీఎం పగ్గాలు అందుకోవటానికి  సిద్ధమైన అమ్మకు తీవ్ర నిరాశ ఎదురుకావటమే కాదు.. అంతవరకూ విధేయుడిగా ఉన్న పన్నీర్ సెల్వం తిరుగుబాట బావుటా విసరటం ఆమెను మరింత ఒత్తిడికి గురి చేసింది.

ఇదిలా ఉంటే.. అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళకు వ్యతిరేకంగా సుప్రీం నుంచి తీర్పు వచ్చే అవకాశం ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కేసులో శశికళకు జైలు తప్పదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఆమె ఎన్నికల్లో పోటీ చేయటానికి అవకాశం ఉండదని.. దాదాపు ఆరేళ్ల వరకూ ఆమె ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ కారణంగానే చిన్నమ్మ నోట జైలు మాట వచ్చిందని చెబుతున్నారు.

జైలుశిక్ష కానీ తీర్పుగా వచ్చిన పక్షంలో దాన్ని రాజకీయంగా చేయటం.. దానివల్ల లబ్థి పొందాలన్నఆలోచనలో చిన్నమ్మ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే తనకు ప్రత్యామ్నాయంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ తీర్పు కానీ తనకు వ్యతిరేకంగా వస్తే.. సానుభూతి పెంచుకోవటం.. తనకు అమ్మకు పెద్ద తేడా లేదన్న భావన కలిగేలా చేసుకోవటం కోసమే.. జైలు మాట మాట్లాడినట్లు చెబుతున్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా అమ్మను తనతో పోల్చుకోవటాన్ని మర్చిపోకూడదు. రానున్నరోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని శశికళ పసిగట్టినట్లుగా చెబుతున్నారు.  

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News