కార్పొరేట్ కోట్లాట‌తో విడిపోనున్న 'చై..నా'

Update: 2017-10-28 04:37 GMT
కార్పొరేట్ కోట్లాట వీధుల్లోకి వ‌చ్చింది. రెండు తెలుగురాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన నారాయ‌ణ‌.. చైత‌న్య సంస్థ‌ల మ‌ధ్య పోటీ ప‌రాకాష్ఠ‌కు వెళ్ల‌టం.. ఒక స్కూల్‌కు చెందిన విద్యార్థుల్ని వేరే వాళ్లు తీసుకెళ్ల‌టం.. ఈ వ్య‌వ‌హారం కేసుల వ‌ర‌కు వెళ్ల‌టం లాంటివి తెలిసిందే.

నెల్లూరుకు చెందిన నారాయ‌ణ స్కూల్‌కు చెందిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను శ్రీ‌చైత‌న్య స్కూల్ వాళ్లు తీసుకెళ్లారంటూ ఆరోప‌ణ‌లు రావ‌టం.. ఈ వ్య‌వ‌హారంపై కిడ్నాప్ చేశారంటూ కేసులు న‌మోదు చేయ‌టం తెలిసిందే. దీంతో.. ఇంత‌కాలం మీడియాకు ఎక్క‌ని వీరి కోట్లాట ఇప్పుడు ఎక్కేసింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విప‌రీత‌మైన పోటీ ఉన్నట్లు క‌నిపించే నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌ల సంస్థ‌లు.. త‌మ పోటీకి అతీతంగా రెండు సంస్థ‌లు క‌లిసి ఉమ్మ‌డి ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించ‌టం.. దీనికి చైనా (చైత‌న్య‌..నారాయ‌ణ‌) అంటూ పొట్టి పేరును పెట్టుకోవ‌టం క‌నిపిస్తుంది. అయితే.. తాజాగా ఈ రెండు సంస్థ‌ల మ‌ధ్య మొద‌లైన కోట్లాట వీరిద్ద‌రూ క‌లిసి నిర్వ‌హించే ఉమ్మ‌డి కార్య‌క్ర‌మాన్ని తెగ‌తెంపులు చేసుకునే వ‌ర‌కూ వెళ్లింది.

ఈ విష‌యాన్ని శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌ల అక‌డ‌మిక్ డైరెక్ట‌ర్ సుష్మ బొప్ప‌న స్వ‌యంగా వెల్ల‌డించారు.

ఐదేళ్లుగా నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేస్తున్నామ‌ని..ఈ  సంద‌ర్భంగా ఎన్నో అవ‌మానాలు భ‌రించామ‌ని.. మ‌రెన్నో మోసాల్ని చూశామ‌ని.. ఇక త‌మ ఓపిక న‌శించిందని.. అందుకే నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌తో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌న్న‌ది క‌ష్ట‌మ‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

వారం క్రితం ముగ్గురు నారాయ‌ణ విద్యార్థుల్ని శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌లు త‌మ స్కూల్లో చేర్పించ‌టంతో మొద‌లైన ర‌చ్చ ఇప్పుడు ఈ రెండు సంస్థ‌ల ఉమ్మ‌డి భాగ‌స్వామ్యంతో న‌డిచే ప్రోగ్రాం విచ్ఛిన్నం అయ్యే వ‌ర‌కూ వెళ్లింద‌ని చెప్పాలి. రెండు రోజుల క్రితం నారాయ‌ణ విద్యార్థుల్ని తాము కిడ్నాప్ చేసిన‌ట్లుగా ఓ స్టూడెంట్ త‌ల్లితో నారాయ‌ణ విద్యాసంస్థ‌ల ప్ర‌తినిధులు పోలీసు కేసు పెట్టించార‌ని.. ఇందులో భాగంగా త‌మ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నార‌న్నారు. అయితే.. ఇందులో త‌మ త‌ప్పు లేద‌ని.. వారం క్రితం ముగ్గురు విద్యార్థుల్ని వారి త‌ల్లిదండ్రులే హైద‌రాబాద్ కు తీసుకొచ్చి త‌మ సంస్థ‌లో చేర్చార‌ని.. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్న‌ట్లు ఆమె చెప్పారు.

ఈ విష‌యాన్ని జిల్లా ఎస్పీతో మాట్లాడ‌గా.. నారాయ‌ణ స్కూల్ నుంచి తీసుకున్న ముగ్గురు విద్యార్థుల్ని తిరిగి నెల్లూరుకు తీసుకొస్తేనే శ్రీ‌చైత‌న్య సిబ్బందిని విడుద‌ల చేస్తామ‌ని చెప్పార‌ని.. ఇది స‌రికాద‌ని సుష్మ బొప్ప‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికార బ‌లంతో..రాజ‌కీయ పైర‌వీల‌తో నారాయ‌ణ విద్యాసంస్థ‌లు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ఆరోపించారు.

గ‌డిచిన 31 ఏళ్లుగా శ్రీ‌చైత‌న్య విద్యాసంస్థ‌లు విలువ‌ల‌తో కూడిన విద్య‌ను అందిస్తున్నాయ‌ని.. విద్యార్థుల‌ను కిడ్నాప్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌తి ఏటా త‌మ ఫ‌లితాల్ని వారి ఫ‌లితాలుగా నారాయ‌ణ విద్యాసంస్థ‌లు ప్ర‌క‌టించుకుంటున్నాయ‌ని విమ‌ర్శించిన సుష్మ‌.. ఇక‌పై నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌తో ప‌ని చేసేది లేద‌న్నారు. త‌మ ఉద్యోగుల‌ను పోలీసుల నుంచి ఎలా విడిపించుకోవాలో త‌మ‌కు తెలుస‌ని.. మంత్రి నారాయ‌ణ సొంత జిల్లాకే వ‌చ్చామ‌ని.. సిబ్బందిని విడిపించుకొనే వెళ‌తామ‌ని సుష్మ వ్యాఖ్యానించ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News