ఇంకో రూట్లో వ‌స్తున్న విప‌క్షం

Update: 2016-12-31 05:44 GMT
విప‌క్షాలు వ్య‌తిరేకిస్తున్న‌ప్ప‌టికీ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప‌ట్టుబ‌ట్టి ఆమోదించుకున్న భూసేకరణ బిల్లుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ మ‌రో పంథాలో పోరాటం మొద‌లు పెట్టింది.  శీతాకాల విడిదికి హైద‌రాబాద్ లోని బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో ఉన్న‌ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని ఈ మేర‌కు పార్టీ నేత‌లు క‌లిశారు. టీపీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి - సిఎల్‌ పి నేత జానారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు కలిసి 2013 భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ తెచ్చిన రాష్ట్ర భూసేకరణ బిల్లును ఉపసంహరింప చేయించాలని కోరారు. ప్రధానమైన చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలు - ప్రజల ప్రయోజనాలను కొత్త బిల్లులో చేర్చకుండా తిలోదకాలు ఇచ్చారన్నారు. 2013 చట్టం సెక్షన్ 107 ప్రకారం ఇప్పటికే ప్రజల రక్షణకు ఉన్న అంశాలకు మించి ఎక్కువ ప్రయోజనం కల్పిస్తే తప్ప, మూల చట్టాన్ని మార్చడానికి, సవరణలు చేయడానికి వీలు లేదని వారు రాష్టపతికి తెలిపారు. 2013 చట్టం కింద బాధితులకు ఇచ్చిన రక్షణలను నీరు కార్చారన్నారు. భూమిని కోల్పోయేవారికి పునరావాస సదుపాయం కల్పించకుండా భూమిని సేకరించే అవకాశం కల్పించారన్నారు. అత్యవసర క్లాజ్‌ ను కూడా ప్రయోగించి భూమిని సేకరించవచ్చన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించుకున్న భూసేకరణ బిల్లును తిరస్కరించాలని, ఇందులో రైతులు - రైతుకూలీలు - భూయజమానులకు కల్పించిన రాజ్యాంగ పరమైన రక్షణలు హరించివేశారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు రాష్ట్రప‌తికి వివ‌రించారు. సామాజిక ప్రభావిత అంచనా, యాజమాన్య ప్రణాళికలు లేకుండా భూమిని సేకరించే క్లాజును చేర్చారన్నారు. ప్రజాప్రయోజనాల నిమిత్తం ప్రాజెక్టులను నెలకొల్పే ప్రైవేట్ కంపెనీలకు భూమిని సేకరించాలంటే 70 నుంచి 80 శాతం మంది భూమి యజమానులు అంగీకరించాలని, ఈ అంశాన్ని కూడా సవరణ బిల్లులో తొలగించారని కాంగ్రెస్ నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. సేకరించే భూమి విలువను మదింపు చేయడం, సవరించే అధికారాలు కలెక్టర్‌ కు ఉన్నాయని, సవరణ బిల్లులో కలెక్టర్‌కు ఉన్న అధికారాల పరిధిని తగ్గించారన్నారు. బాధితులకు పరిహారం పెంపుదల, పునరావాస సదుపాయం పెంచడం తదితర అంశాలు లేవన్నారు. భూసేకరణకు రైతు అంగీకారం- గ్రామసభ - సామాజిక - పర్యావరణ ప్రభావం అంచనా- ఆహార భద్రత వంటి మౌలిక అంశాలు లేవన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకు నాలుగింతలు ప్రభుత్వం సేకరించే భూమికి పరిహారం చెల్లించాలన్న నిబంధనకు ఈ బిల్లు స్వస్తి పలికిందని కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ బిల్లు రైతాంగ వ్యతిరేకమైనదన్నారు. భూసేకరణ వల్ల బాధిత రైతులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా తెలంగాణ భూసేకరణ బిల్లు ఉందన్నారు. రైతాంగ ప్రయోజనాలకు హాని చేసే అంశాలు ఉన్న భూసేకరణ బిల్లుకు ఎటువంటి పరిస్థితుల్లో ఆమోదం తెలియచేయవద్దని కాంగ్రెస్ నేతలు రాష్టప్రతిని కోరారు. విప‌క్ష నేత‌ల కొత్త రూటు పోరాటం ఏ మేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి మ‌రి!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News