అంతా మీరే చేశారు జానారెడ్డిగారూ..

Update: 2016-08-30 06:31 GMT
తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం మునుపెన్నడూ లేనట్లుగా వాడివేడిగా సాగింది. సీనియర్ లీడర్ జానారెడ్డిని టార్గెట్ చేసి పలువురు ఎమ్మెల్యేలు ఆయన వైఖరిని తప్పుపట్టారు. టీఆరెస్ ప్రభుత్వం పట్ల ఆయన చూసీచూడనట్లుగా ఉంటున్నారని ఆరోపించారు.  జూనియర్లు - సీనియర్లు అనే తేడాలేకుండా అందరూ పార్టీ ప్రతిష్టను పెంచే విధంగా వ్యవహరించాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశంలో అధికులు అభిప్రాయపడ్డారు. మంగళవారం నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో జానారెడ్డి తెగ ఇబ్బంది పడ్డారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. చివరకు ఆయన సభ్యుల విమర్శలు - ఆరోపణల నేపథ్యంలో వివరణ కూడా ఇచ్చుకున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంపై  ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతుంటే దాన్ని చల్ల బరిచేలా కొందరు మాట్లాడుతున్నారని... ఇకపై ఎవరూ అలా మాట్లాడరాదని పలువురు పేర్కొన్నారు.  సీనియర్లే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే ఎలా ? అటూ పలువురు సభ్యులు జానారెడ్డిని నేరుగా ప్రశ్నించినట్లు సమాచారం.  అయితే, తానెప్పుడూ అలా వ్యవహరించలేదని ... పత్రికలే వక్రీకరించి రాశాయని జానా నెపాన్ని మీడియాపై నెట్టేశారని సమాచారం.  జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి 13 మంది ఎమ్మెల్యే లలో 9 మంది హాజరయ్యారు. నలుగురు హాజరు కాలేదు. ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - మల్లు భట్టివిక్రమార్క - డికె అరుణ - టి జీవన్‌ రెడ్డి - వంశీచంద్‌ రెడ్డి - జి చిన్నారెడ్డి - రామ్మోహన్‌ రెడ్డి - ఎస్‌ ఎ సంపత్‌ కుమార్‌ ఉన్నారు. ఎమ్మెల్యేలు డాక్టర్‌ జె గీతారెడ్డి - ఎన్‌ పద్మావతి - దొంతు మాధవరెడ్డి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరుకాలేదు. శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ - ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకరరెడ్డి - ఆకుల లలిత - కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్‌ రెడ్డి - దామోదర్‌ రెడ్డి - మ్యాకం రంగారెడ్డి - సంతోష్‌ కుమార్‌ -ఎంపీలు రాపోలు ఆనందభాస్కర్‌ - ఎంఎ ఖాన్‌ కూడా సమావేశానికి వచ్చారు.

వివిధ అంశాలపైన, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించినా చివరకు రాజకీయ అంశాలు, ప్రాజెక్టులపై చర్చ వచ్చినప్పుడు ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా సంఘాలు పోరాడుతున్నాయని, ప్రధాన ప్రతిపక్షంగా మరింత బాధ్యత ఉందని, అలాంటప్పుడు మెతకవైఖరి అనుసరించడం సరికాదని సభ్యులు సూచించారు. ముఖ్యంగా జానారెడ్డిని విమర్శిస్తూ అధికులు అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తుమ్మడిహట్టి బ్యారేజీ ఎత్తు విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు  జానారెడ్డిని నేరుగా నిలదీసినట్లు తెలిసింది. ప్రభుత్వం వైఖరిపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే అంశాన్ని ప్రజలు గమనిస్తారని, అలాంటప్పుడు నోరు జారితే వ్యక్తిగతంగా ఇరుకున పడడమే గాక పార్టీ దెబ్బతింటుందని అన్నారు. దీనికి జానారెడ్డి స్పందిస్తూ, తానేమీ తప్పుగా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. తాను 152 మీటర్ల ఎత్తుకు రెండు రాష్ట్రాల టెక్నికల్‌ కమిటీ అంగీకరించిందని చెప్పానని, అలాగే, తెలంగాణ ఉద్యమం వచ్చినందున ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదరలేదని చెప్పినట్లు తెలిసింది. తాను మాట్లాడింది ఒకట్రెండు పత్రికలు వక్రీకరించాయని.. మిగతావారు కరెక్టుగా రాశారని చెబుతూ ఆ వార్తలను కూడా జానారెడ్డి చూపించినట్లు సమాచారం. అయితే... జానారెడ్డి పత్రికల క్లిప్పింగులను తను వెంట తెచ్చుకోవడంతో ఆయన ముందే ఈ నిలదీతను ఊహించారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అందుకనే ఆయన మద్దతుగా అవన్నీ తెచ్చుకున్నారని చెబుతున్నారు.
Tags:    

Similar News