దారుణం.. ప్రతి ఆసుపత్రిలో 'ఠాగూర్‌' సన్నివేశాలే

Update: 2021-05-21 08:30 GMT
చిరంజీవి నటించిన ఠాగూర్ లో ఆసుపత్రి సన్నివేశం ఒకటి ఉంటుంది. అందులో చనిపోయిన శవంకు ట్రీట్మెంట్‌ చేసి లక్షల ఫీజును వసూళ్లు చేస్తారు. ఆ సన్నివేశం ప్రస్తుతం ఉన్న కార్పోరేట్‌ ఆసుపత్రుల తీరుకు అద్దం పడుతుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఆసుపత్రుల్లో చికిత్స చేసేదానికి వసూళ్లు చేస ఫీజుకు సంబంధం ఉండదు. చిన్న అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లినా పదుల సంఖ్యలో టెస్టులు నిర్వహించడంతో పాటు పెద్ద భయాలు పెడుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ పద్దతి కొన్ని ఆసుపత్రుల్లో ముఖ్యంగా కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఉండేదని టాక్‌. కాని ఇప్పుడు కరోనా నేపథ్యంలో మెజార్టీ ప్రైవేట్‌ ఆసుపత్రులు అలా తయారయ్యాయంటున్నారు.

కరోనా జనాల్లో చావు భయం కలిగిస్తుంది. కరోనా సోకితే చనిపోతారేమో అనే భయం వల్ల లక్షల రూపాయలు చెల్లించి ట్రీట్మెంట్‌ కు సిద్దం అవుతున్నారు. కరోనాకు చికిత్స అనేదే లేదు. అయినా కూడా కొందరు కరోనా పాజిటివ్ రాగానే వెంటనే ఆసుపత్రుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారి భయాన్ని క్యాష్‌ చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక రకాలుగా వారి నుండి డబ్బు గుంజుతున్నారు. కరోనా ను నిర్థారించేందుకు సీటీ స్కాన్‌ చేయకున్నా చేస్తున్నామని చెబుతున్నారట. ఇక ఆక్సీజన్‌ అవసరం లేకున్నా పెట్టి వేలకు వేల ఫీజులు లాగుతున్నారు.

రెమ్డిసివిర్ ఇంజక్షన్ ల అవసరం ఉన్నా లేకున్నా ఇస్తున్నట్లుగా డ్రామా చేస్తున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ కు వేల రూపాయలను వసూళ్లు చేస్తున్నారు. బెడ్డు చార్జ్‌.. పీపీఈ కిట్స్ నుండి మొదలుకుని ప్రతి చిన్నదానికి కూడా పెద్ద మొత్తంలో బిల్లు వేస్తున్నారు. అదృష్టం బాగుంటే పేషంట్‌ కు నెగటివ్‌ వచ్చి బయట పడుతున్నాడు. పయట పడ్డ సమయంలో ఆసుపత్రి రేంజ్ ను బట్టి లక్ష నుండి పది లక్షల వరకు బిల్లు చెల్లిస్తున్నాడు. ఇక కొందరు ముందస్తు అనారోగ్య సమస్యలు ఉన్న వారి పరిస్థితి దారుణం. వారు బతకరు అని తెలిసినా కూడా వారం నుండి పది రోజుల వరకు ట్రీట్మెంట్ ఇస్తూ ఆసుపత్రి వారు హడావుడి చేస్తూ ఉంటారు.

వారం పది రోజుల తర్వాత మృతదేహంను తీసుకు వెళ్లండి అంటూ బిల్లు చేతిలో పెడుతున్నారు. ఈ దారుణ సంఘటనలు ప్రతి రోజు ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. కరోనా భయంను ఆసుపత్రులు క్యాష్‌ చేసుకుంటున్న తీరు మానవత్వంకు మచ్చగా మారుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంతో బిజినెస్ చేస్తున్న వారు అంది వచ్చిన అవకాశం అన్నట్లుగా లక్షలు.. కోట్లు కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి విపత్తు సమయంలో మానవత్వంను మరచి కొందరు కార్పోరేట్‌ ఆసుపత్రుల వారు చేస్తున్న ఈ మెడికల్‌ దందాను ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం దారుణం అంటూ బాధితులు మరియు కొందరు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News