తాజ్ లో షాండ్లియర్ పడిపోయింది

Update: 2015-08-22 00:47 GMT
నిర్లక్ష్యానికి హద్దు అంటూ ఉంటుంది. ప్రపంచంలోని ఎనిమిది వింతల్లో ఒకటిగా నిలిచి.. నిత్యం వేలాది మంది సందర్శించే తాజ్ మహాల్ నిర్వహణ పట్ల అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్న విషయాన్ని చెప్పే ఘటన తాజాగా చోటు చేసుకుంది.

నిత్యం వేలాది మంది వస్తూ.. అందరి మనసుల్ని దోచుకునే తాజ్ మహాల్ నిర్వహణ బాధ్యత విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి. తాజ్ పరిసర ప్రాంతాల్లోని ప్రతి చిన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సింది పోయి.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించటంతో తాజ్ మహాల్ లో ఏర్పాటు చేసిన షాండ్లియర్ ఒకటి పడిపోయినట్లు చెబుతున్నారు.

దాదాపు 60 కిలోలు ఉండే ఈ షాండ్లియర్ అరు అడుగుల ఎత్తు.. నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. తాజ్ మహాల్ లోని రాయల్ గేట్ వద్ద అమర్చిన ఈ షాండ్లియర్ పడిపోయిన విషయానికి సంబంధించి అధికారికంగా సమాచారం ఇప్పటివరకూ వెలువడలేదు. ఈ షాండ్లియర్ ను బ్రిటీష్ అధికారి లార్డ్ కర్జన్ బహుకరించారు.

షాండ్లియర్ పాతదైపోవటం వల్ల పడిపోయిందంటూ కొందరు అధికారులు వ్యాఖ్యానిస్తున్నా.. అదంతా నిర్లక్ష్యానికి పరాకాష్ఠ తప్పించి మరొకటి కాదంటున్నారు. త పాతదైతే మాత్రం పడిపోయే వరకూ ఎందుకు ఆగినట్లు. ఒకవేళ పాతదై పడిపోయే అవకాశమే ఉంటే.. ముందస్తుగా గుర్తించి కాపాడాల్సింది పోయి.. అందుకు భిన్నంగా వ్యవహరించటం చూసినప్పుడు అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మారుమూల ఉన్న చారిత్రక సంపద విషయంలో ఇలా జరిగితే.. ఏదో కారణమని చెబితే అర్థం ఉంటుంది. కానీ.. తాజ్ లాంటి ప్రముఖ కట్టడం వద్ద సైతం ఇదే నిర్లక్ష్యం ఉందంటే.. దే.. వు.. డా..?
Tags:    

Similar News