హ‌రికృష్ణ ఉంటే మ‌హాకూట‌మిని అడ్డుకునే వారు

Update: 2018-10-02 16:41 GMT
గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ ను రాబోయే ఎన్నిక‌ల్లో ఓడించ‌డమే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న విప‌క్షాలు..కాంగ్రెస్ సార‌థ్యంలోని మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌-టీడీపీ-సీపీఐ- తెలంగాణ జ‌న‌స‌మితి క‌లిసి ఏర్పాటు చేసిన ఈ కూట‌మి అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అదే రీతిలో టీఆర్ ఎస్ సైతం కూట‌మి నేత‌ల‌పై విరుచుకుప‌డుతున్నారు. టీడీపీ- కాంగ్రెస్‌ ల‌ది అనైతిక పొత్తు అని పార్టీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీ కాంగ్రెస్ జ‌ట్టుక‌ట్టాయ‌ని మండిప‌డుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో తాజాగా తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాదవ్ హాట్ కామెంట్లు చేశారు. దివంగ‌త నంద‌మూరి హరికృష్ణ ఈ కూట‌మి ఏర్పాటును త‌ప్పుప‌ట్టేవార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ఓవైపు టీడీపీ కూట‌మి అభ్య‌ర్థుల గెలుపుకోసం స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌చారంపై తాజాగా త‌ల‌సాని శ్రీ‌నివాస్‌ యాద‌వ్ స్పందిస్తూ...బాల‌కృష్ణ కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నార‌ని అయితే ఆయ‌న సోదరుడైన నంద‌మూరి హ‌రికృష్ణ మాత్రం ఈ నిర్ణ‌యాన్ని ఏ మాత్రం హ‌ర్షించే వారు కాద‌న్నారు. హ‌రికృష్ణ జీవించి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్‌-టీడీపీల మైత్రిని త‌ప్పుప‌ట్టేవార‌ని త‌ల‌సాని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలోని నేత‌లే ఈ పొత్తును హ‌ర్షించ‌డం లేద‌ని త‌ల‌సాని పేర్కొన్నారు. పార్టీ భ‌విష్య‌త్తును ప‌ణంగా పెట్టి చేసుకుంటున్న ఈ పొత్తు వ‌ల్ల ఏపీలో టీడీపీ న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని త‌ల‌సాని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News