త‌ల‌సాని.. మాధ‌వ‌రంల‌కు ఏపీలో ఘ‌న స్వాగ‌తం

Update: 2019-01-14 10:08 GMT
రెండు రాష్ట్రాలుగా తెలుగు నేల ముక్క‌లైన త‌ర్వాత‌.. తెలంగాణ‌లో క‌నిపించ‌ని ఒక ధోర‌ణి ఏపీలో మాత్రం క‌నిపిస్తుంది. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న కాన్సెప్ట్ తో తెలంగాణ ఉద్య‌మ‌కారుల ప్ర‌పోజ‌ల్ విభ‌జ‌న త‌ర్వాత ప‌క్క‌కు వెళ్లిపోవ‌టం క‌నిపిస్తుంది. ఎవ‌రైనా ఏపీకి చెందిన వారు కానీ..ఆంధ్రా మూలాలు ఉన్న వారు తెలంగాణ‌లో  ఎలా చూస్తారు?  వారికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌వుతాయ‌న్న‌ది ఎవ‌రికి వారికి తెలిసిందే. మిగిలిన సంగ‌తులు ఎలా ఉన్నా.. ఆంధ్రా ముత్యం.. ఆంధ్రా క‌త్తి.. ఆంధ్రా రైఫిల్.. ఆంధ్రా సింహం.. ఆంధ్రా పులి పేర్ల‌తో  తెలంగాణ‌లో ఎక్క‌డా ఎలాంటి ఫ్లెక్సీలు పెట్ట‌టం క‌నిపించ‌దు. ఆ మాట‌కు వ‌స్తే.. అలాంటి ఆలోచ‌న చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు.

అలాంటిది ఏపీలో మాత్రం తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ‌ల పుట్టిన‌రోజులు మొద‌లు కొని.. ముఖ్య‌మైన అంశాల‌కు సంబంధించి త‌మ ఆనందాన్ని తెలిపేలా ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్లు క‌ట్ట‌టం క‌నిపిస్తుంటుంది. ఎక్క‌డి వ‌ర‌కో ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ రెండోసారి ఎన్నికై.. ఆ మ‌ధ్య‌న విశాఖ‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న ఫోటోల‌కు పాలాభిషేకాలు.. ఫ్లెక్సీలు.. బ్యాన‌ర్లు క‌ట్టిన వైనం తెలిసిందే.

తాజాగా.. సంక్రాంతి పండ‌గ నేప‌థ్యంలో టీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రి త‌ల‌సాని.. కుక‌ట్ ప‌ల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధ‌వ‌రం కృష్ణారావులు భీమ‌వ‌రంలో జ‌రిగిన వేడుక‌ల్లో పాల్గొన‌నున్నారు. వీరితో పాటు.. హైద‌రాబాద్‌కు చెందిన ప‌లువురు కార్పొరేట‌ర్లు ఏపీకి త‌ర‌లి వ‌చ్చారు. వీరిని కీర్తిస్తూ..పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు.. బ్యానర్లు క‌ట్టిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

తెలంగాణ నేత‌లు ఆంధ్రాకు.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన నేత‌లు తెలంగాణ‌కు వెళ్ల‌టం త‌ప్పేం కాదు. కానీ.. ఆంధ్రాప్రాంతానికి సంబంధించిన వారు చూపించే అభిమానం.. ఫ్లెక్సీల పేరుతో వారు కీర్తించే పైత్యం అంత‌కంత‌కూ ఎక్కువ అవుతుంద‌న్న విమ‌ర్శ ప‌లువురి నోట వినిపిస్తోంది. ఇదే తీరు తెలంగాణ‌లో ఉంటే త‌ప్పేం కాదు. అందుకు భిన్నంగా వ‌న్ సైడ్ అభిమానం స‌రికాదంటున్న తీరు అంత‌కంత‌కూ పెరుగుతోంది.

ఇదిలా ఉంటే.. దీనికి కార‌ణం కులం మీద ఉన్న అభిమానంగా చెబుతున్నారు. ఆంధ్రాతో పోలిస్తే.. తెలంగాణ‌లో కులం మీద అభిమానం చాలా చాలా త‌క్కువ‌ని చెప్పాలి. ప్ర‌తి నేత‌ను కులం కోణంలో చూసే ద‌రిద్రం ఏపీలో ఎక్కువైతే.. తెలంగాణ‌లో అలాంటిది ఉండ‌దు. మ‌హా అయితే పార్టీ కోణంలో చూస్తారే త‌ప్పించి.. కులాన్ని లెక్క‌గా తీసుకొని అభిమానించ‌టం.. ఆద‌రించ‌టం లాంటివి త‌క్కువ‌. ఈ కార‌ణంతోనే తెలంగాణ‌లో క‌నిపించ‌ని ఫ్లెక్సీలు.. ఏపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

   

Tags:    

Similar News