బాబు దగ్గరే పనిచేశా..ఆయన ఎంత నీతిమంతుడో తెలియదా?

Update: 2018-12-30 16:58 GMT
కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడితే చంద్రబాబుకు ఎందుకు భయం కలుగుతోందని టీఆర్ ఎస్ మాజీ మంత్రి - ఒకప్పటి చంద్రబాబు కేబినెట్ లోని మంత్రి అయిన తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. హుందాగా మాట్లాడుతానని చంద్రబాబు తనకు తానే కితాబిచ్చుకుంటున్నారని.. హుందాతనం గురించి ఆయన మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. ఆయన దగ్గర పనిచేసినవాళ్లమేనని.. ఆయన గురించి తమకు తెలుసని.. ఇప్పుడాయన హుందాతనం వంటి మాటలు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.
  
ఎన్టీఆర్ అల్లుడిగా పార్టీలోకి వచ్చిన చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తామేనని అన్నారు. చంద్రబాబు ఎంత నీతిమంతుడో టీడీపీ కార్యకర్తలను అడిగితే చెబుతారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చుపెట్టిన వెయ్యి కోట్లు ఎక్కడి నుంచి తెచ్చావు? ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్మంతా చంద్రబాబుదే. ప్రధాని మోదీతో అంటకాగింది నువ్వు కాదా? చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి ఎన్టీఆర్ దగ్గర పార్టీ గుంజుకోలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబుకు ఓ పద్ధతి - పాలసీ ఉన్నాయా? అవసరానికి తగ్గట్టుగా రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటేనని విమర్శించారు.
  
చంద్రబాబు నాయుడు వస్తే నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి హైటెక్‌ సిటీకి ఎక్కడ ఫౌండేషన్‌ వేశారో చూపిస్తానని సవాల్‌ విసిరారు. ఒడిశా - కలకత్తా వెళ్లి సీఎం కేసీఆర్‌ ఏం చేశారో ముందు ముందు మీకు తెలుస్తుందని అన్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో వందల కోట్ల రూపాయలు వృథా చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు అన్నీ కూడా రాజశేఖర్‌ రెడ్డే మొదలు పెట్టారని - నదుల అనుసంధానం కూడా 80 శాతం రాజశేఖర్‌ రెడ్డియే చేశారని వ్యాఖ్యానించారు.


Full View

Tags:    

Similar News