స్టింగ్ ఆపరేషన్ చేయించిన టీ మంత్రి

Update: 2015-11-16 06:09 GMT
రాజకీయాల్లో ఇదో కొత్త కోణంగా చెప్పాలి. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చే తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని ఈసారి అందుకు భిన్నమైన కోణంలో వార్తలకు ఎక్కారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ఎగగొట్టే వారిపై దృష్టి పెట్టిన ఆయన.. గతంలో పలుమార్లు చాలానే వార్నింగ్ లు ఇచ్చారు. అక్రమ వ్యాపారాలు మానుకోవాలని.. ప్రభుత్వానికి న్యాయంగా కట్టాల్సిన పన్ను కట్టాలని కోరారు. అయినా.. పరిస్థితుల్లో మార్పు రాకపోవటంతో స్వయంగా ఆయనే ఒక స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు.

సాధారణంగా రాజకీయనాయకుల అక్రమ భాగోతాల్ని బయటపెట్టేందుకు స్టింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తుంటారు. తలసాని మాత్రం ప్రభుత్వానికి రాకుండా పోతున్న పన్ను ఆదాయం మీద ఫోకస్ చేసి విజయం సాధించారు. తన శాఖకు చెందిన  కొందరు అధికారుల్ని పిలిపించి.. వారి చేతికి కొంత డబ్బు ఇచ్చి హైదరాబాద్ లోని మలక్ పేట రేస్ క్లబ్బులో ఆడాలని కోరారు. మంత్రి గారు చెప్పినట్లే ఆడిన వారు.. కొంత మొత్తాన్ని గెలుచుకున్నారు కూడా.  వారి చేతికి ప్రైజ్ మనీ వచ్చాక అసలు కథ మొదలైంది. ఇలా వచ్చిన ప్రైజ్ మనీలో 14.5  శాతం సేవాపన్ను కట్టాల్సి ఉంటుంది. అయితే.. 95 శాతంమంది ఆడేవారు..తమకు వచ్చిన మొత్తాన్ని తీసుకెళ్లేవారే కానీ పన్ను కట్టేవారు ఉండటం లేదట. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావటానికి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి సక్సెస్ అయ్యారు మంత్రి తలసాని. ఏమైనా.. రాజకీయాల్లో తలసాని ఒక కొత్త కోణాన్ని షురూ చేశారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News