ఒకే రోజు వారిద్దరి చొక్కాలు చిరిగిపోయాయ్

Update: 2017-02-18 12:08 GMT
ఒకే రోజులో గంటల వ్యవధిలో రెండు పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. షాకింగ్ లాంటి ఈ ఉదంతాలు రానున్న తమిళనాడు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయనటంలో సందేహం లేదు. అవాంచనీయమైన ఈ రెండు సంఘటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పెద్ద చర్చకు తెర తీసేలా చేశాయని చెప్పాలి. చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ రెండు సంఘటనల్లోనూ రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న ఇద్దరు ప్రముఖుల చొక్కాలు చినగటం. తమిళనాట చోటు చేసుకున్న ఈ వ్యవహారంలోకి వెళితే..

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి బలనిరూపణ సందర్భంగా తమిళనాడు అసెంబ్లీ ఈ ఉదయం కొలువుతీరింది. ఈ సందర్భంగా డీఎంకే సభ్యులు రహస్య ఓటింగ్ ను చేపట్టాలని స్పీకర్ ను కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రహస్య ఓటింగ్ చేపట్టాలన్న డీఎంకే సభ్యుల వాదనను స్పీకర్ తిరస్కరించారు. దీంతో.. సభలో నిరసన మొదలైంది. ఇది అంతకంతకూ పెరిగి.. స్పీకర్ పోడియంను ధ్వంసం చేసే వరకూ వెళ్లింది. స్పీకర్ పోడియంను ధ్వంసం చేసి.. మైకును విరిచేసిన డీఎంకే సభ్యుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఒకదశలో స్పీకర్ భుజాన్ని పట్టుకొని లాగినట్లుగా పలువురు ఆరోపించారు.

తనకు ఘోరమైన అవమానం జరిగిందని.. ఆ విషయాల్ని ఎవరికి చెప్పుకోవాలంటూ స్పీకర్ ధన్ పాల్  ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే సభ్యుల ప్రవర్తన కారణంగా తన చొక్కా చినిగినట్లుగా ఆయన ఆరోపించారు. ఇదిలా ఉంటే.. సభలో డీఎంకే సభ్యుల తీరును తప్పు పడుతూ.. వారందరిపై మూకుమ్మడి వేటు వేశారు. సభ నుంచి సస్పెండ్ చేసి.. వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపాలంటూ ఆదేశాలు జారీ చేసి.. సభను వాయిదా వేశారు.

దీంతో.. సభలో నిరసన చేపట్టిన డీఎంకే ఎమ్మెల్యేల్ని అసెంబ్లీ నుంచి బయటకు పంపేందుకు మార్షల్స్ పెద్ద ఎత్తున ప్రయత్నించి.. సభ్యులను అసెంబ్లీ నుంచి క్లియర్ చేశారు. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత స్టాలిన్ ను మార్షల్ పైకెత్తి..ఆయన్ను బలవంతంగా ఎత్తి.. తీసుకెళ్లారు. ఈ క్రమంలో మార్షల్స్ కారణంగా.. ఆయన చొక్కా పూర్తిగా చినిగిపోయింది. 

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News