మన దగ్గరా ఇంటిపని చేసే రోబోలు వచ్చేశాయ్

Update: 2016-04-22 07:07 GMT
జపాన్.. చైనా లాంటి దేశాల్లో రోబోల హడావుడి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుమనాయుడ్ రోబోలతో వారు అద్భుతాలే చేస్తున్నారు. దూరం నుంచి మనుషుల మాదిరి ఉండే రోబోలతో వారు పనులు చేస్తున్న వేళ.. మన దేశంలో రోబోల వినియోగాన్ని చూస్తే పరిమితంగానే ఉందని చెప్పక తప్పదు. రోబోల వినియోగంతో ప్రమాదకరమైన పనుల్ని.. కష్టతరమైన పనుల్ని సులువుగా చేయించుకునే వీలుంది.

ఇలాంటి వాటికి భారీ ఆదరణ ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన భారత కంపెనీలు ఇప్పుడిప్పుడే రోబోల తయారీ మీద దృష్టి సారిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన మేకిన్ ఇండియా కార్యక్రమంలో టాటా కంపెనీ తన బ్రాబో రోబోల్ని ప్రదర్శించింది. ఈ రోబోలు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించాయి. దేశీయ అవసరాలకు తగ్గట్లుగా వీటిని రూపొందించటం విశేషం.

ఈ రోబోలతో ఇంటి పనులు.. వెల్డింగ్.. బరువులు ఎత్తటం.. చిన్నచిన్న పరిశ్రమల్లో పనులకు వీటిని వినియోగించేలా రూపొందించారు. తాజాగా టాటా కంపెనీ ప్రదర్శించిన బ్రాబో రోబో రూ.3లక్షల వరకూ ఉంటుంది. ఇది 2 కిలోల బరువు వరకూ ఎత్తుతుంది. అదే సమయంలో రూ.6లక్షలు విలువ చేసే బ్రాబో రోబో అయితే పది కిలోల బరువు పనుల్ని సులువుగా ఎత్తేయనుంది. ఈ నేపథ్యంలో ఇంటి పనులకు.. ఆఫీసుల్లో.. హోటల్స్.. రెస్టారెంట్లలో పనులు చేసేందుకు వీలుగా రోబోల్ని రూపొందిస్తున్నారు. వీటి వినియోగం పెరిగితే ధరలు సైతం తగ్గే వీలుందని చెబుతున్నారు. సో.. రానున్న రోజుల్లో మనుషులు చేసే చాలా పనులు రోబోలే చేయనున్నాయన్న మాట.
Tags:    

Similar News