సీఎంకు అయితే పన్ను మినహాయింపా?

Update: 2015-08-26 04:41 GMT
ఖర్చు పెట్టాలంటే.. చేతిలో డబ్బు ఉండాల్సిందే. సామాన్యుల విషయంలో రోజుకో కొత్త పన్ను వేసి.. ముక్కుపిండి వసూలు చేసే ప్రభుత్వాలు.. తమ వరకు వస్తే మాత్రం ఏదో రకంగా రాయితీ ఇచ్చుకోవటమో.. లేదంటే తమకున్న విచక్షణాధికారంతో రద్దు చేసుకోవటమో చేస్తాయి. ఆ చేత్తో ఇచ్చి..ఈ చేత్తో తీసుకోవటం వల్ల వద్దన్నట్లుగా చెప్పినా.. లెక్క లెక్కలా ఉండాలన్న సూత్రానికి విరుద్ధంగా ప్రభుత్వాలు తమకున్న పవర్ తమకు అనుకూలమైన నిర్ణయాల్ని తీసేసుకుంటాయి.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో తెలంగాణ సర్కారు తీసుకున్న పన్ను మినహాయింపు ఇలాంటిదే. ఒక సామాన్యుడు అప్పొ.. సొప్పో చేసి ఏదైనా వాహనం కొన్న వెంటనే.. గూబ గుయ్యమనేలా పన్ను రేటు ఉంటుంది. ఒక టూవీలర్ కు కంపెనీ రేటు కాకుండా.. ఆ పన్ను ఈ పన్ను అంటూ రాష్ట్రానికి సంబంధించిన పన్నులే రూ.10వేలు.. అదే కారుకైతే రూ.లక్ష వరకూ ఉంటాయి. ఇందులో కేంద్రం ఎక్సైజ్ లాంటి పన్నులు కలవవు.

సామాన్యుడు.. మధ్యతరగతి జీవి తనకు భారమైనా.. ప్రభుత్వ విధానాల్లో భాగంగా నోరు మూసుకొని.. మారు మాట్లాడకుండా పన్ను చెల్లించేస్తాడు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం తెలంగాణ సర్కారు బుల్లెట్ ఫ్రూప్ బస్సును కొనుగోలు చేసింది. దాదాపు రూ.5కోట్ల ఖర్చుతో కొనుగోలు చేసిన ఈ బస్సుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రూ.37.33లక్షల పన్నుచెల్లించాల్సి వచ్చింది.

ముఖ్యమంత్రి వాహనం అయితే.. రూలు రూలేగా. కానీ.. ప్రభుత్వం తలుచుకుంటే ఏముంది? అంత పెద్ద మొత్తంలో ఉన్న పన్నును ఒక కలం పోటుతో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సామాన్యుడు అప్పు చేసి మరీ.. చెల్లించాల్సిన పన్నును.. ప్రభుత్వాలు.. ప్రభుత్వాధినేతల విషయంలో మాత్రం ఒక్క కలంపోటుతో రద్దు చేసి పారేయటం చూసినప్పుడు.. పవర్ ఉన్నోడికే ఏదైనా సాధ్యమన్న మాట అనిపించక మానదు. ప్రభుత్వ ఆదాయాన్ని ప్రభావితం చేసే కన్నా.. కట్టాల్సిన పన్ను మొత్తాన్ని కడితే పోయేదేముంది? ఆ డబ్బులేవో ప్రభుత్వానికే కదా వచ్చేవి.

ఒక శాఖకు ఖర్చుగా ఉన్నా.. మరో శాఖకు ఆదాయంగా మారే ప్రక్రియను కూడా రద్దు చేసేయాలా? మినహాయింపు ఇచ్చేయాలా? లెక్క విషయంలో ప్రభుత్వమే ఇంత జాగ్రత్తగా ఉంటే.. సామాన్యులు తమ జేబుల్లో నుంచి తీసే రూపాయి విషయంలో ఇంకెన్ని ఇబ్బందులు పడుతుంటారు? కానీ.. వాడికి మాత్రం పన్ను పోటు తప్పకపోవటం గమనార్హం.
Tags:    

Similar News