‘ఇంటి నుంచి పని’పై టీసీఎస్ కీలక నిర్ణయం.. రెఢీగా ఉండండి!

Update: 2021-09-07 04:00 GMT
‘ఇంటి నుంచి పని’ చేసే పద్దతికి శుభం కార్డు వేయాలన్న ఆలోచనకు ఐటీ కంపెనీలు వచ్చేస్తున్నాయి. కరోనా కారణంగా గడిచిన ఏడాదిన్నరగా ఉద్యోగుల్ని ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతిని ఇచ్చాయి ఐటీ కంపెనీలు. కీలక ఉద్యోగులు కొంతమందిని మాత్రం ఆఫీసుకు పిలిపించి పని చేయించారు. తాజాగా ఇంటి నుంచి పని చేసే విధానానికి పుల్ స్టాప్ పెట్టి.. ఉద్యోగుల్లో 80 శాతానికి పైనే ఆఫీసుకు రావాలన్న నిర్ణయాన్ని ప్రకటిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలోకి వచ్చేసింది దేశంలోని అత్యుత్తమ ఐటీ కంపెనీల్లో ఒకటైన ‘టీసీఎస్’. తాజాగా ఈ కంపెనీ సీఈవో  రాజేశ్ గోపీనాధన్ మాట్లాడుతూ.. తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరుతామని ప్రకటించారు.

అయితే ఈ ఏడాది చివరకు లేదంటే వచ్చే ఏడాది మొదట్లో ఆఫీసులకు రావాలని ఉద్యోగుల్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా 70-80 శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు పిలిపిస్తామన్నారు. అయితే.. మరికొద్ది రోజుల్లో మొదలవుతుందంటూ ప్రచారం జరుగుతున్న థర్డ్ వేవ్ నేపథ్యంలో మార్పులు.. చేర్పులపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయటం.. కొత్త కేసుల సంఖ్య తక్కువగా ఉండటతో ఆఫీసులకు వచ్చి పని చేసేలా నిర్ణయాల్ని మార్చాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

టీసీఎస్ కు మొత్తం 5 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. వీరిలో 70-80 శాతం ఉద్యోగుల్ని ఆఫీసులకు రమ్మని కోరుతామన్నారు. ఇంటి నుంచి పనికి బదులుగా ఆఫీసు నుంచే పని చేయాలన్న అంశంపై టీసీఎస్ సీరియస్ గా నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం మిగిలిన టెక్ కంపెనీలు సైతం టీసీఎస్ బాట పడటం ఖాయమన్న మాట పలువురు ఐటీ కంపెనీలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 195 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ టీసీఎస్.. తనను తాను మరింత బలోపేతం కావటానికి కొత్త కంపెనీలను కొనుగోలు చేయటం కంటే కూడా.. సామర్థ్యాల పెంపుపై ఫోకస్ పెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఇంటి నుంచి పనికి చెక్ చెప్పేలా టీసీఎస్ నిర్ణయం తీసుకుంటే.. మిగిలిన కంపెనీలు వెంటనే ఆ ఆలోచనను ఎవరికి వారు అమలు చేస్తారన్న మాట వినిపిస్తోంది. సో.. ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లటానికి మెంటల్ గా ప్రిపేర్ కండి.
Tags:    

Similar News