జ‌న‌సేన‌తో టీడీపీ స‌ర్దుబాటు.. విష‌యం చెప్పేసిన బుచ్చ‌య్య‌

Update: 2021-09-20 09:32 GMT
ఏ విష‌యాన్న‌యినా.. దాప‌రికం లేకుండా.. నేరుగా.. అంత‌కుమించి ముక్కుసూటిగా మాట్లాడ‌తాన‌ని చెప్పే రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కులు గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి.. మ‌రోసారి.. ఇదే త‌ర‌హాలో ఓ కీల‌క విష‌యాన్ని వెల్ల‌డించారు. స్థానిక ఎన్నిక‌ల్లో.. సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో అవ‌స‌ర‌మైతే.. జ‌న‌సేన పార్టీతో స‌ర్దుబాటు చేసుకుని ముందుకు సాగుతామ‌ని తెలిపారు. వాస్త‌వానికి.. రాష్ట్రం లో తాజాగా వెల్ల‌డైన ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా విజ‌యం ద‌క్కించుకుంది. ఎంపీటీసీ, జ‌డ్పీటీ సీ ఫ‌లితాల‌ను ఏక‌ప‌క్షంగా ద‌క్కించుకుంది.

అయితే.. గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి వంటి కొన్ని జిల్లాల్లో.. టీడీపీ కొన్ని స్థానాల‌ను అధికంగా గెలుచుకుంది. అదేస‌మ‌యంలో ఆయా జిల్లాల్లో.. జ‌న‌సేన కూడా కొన్ని స్థానాల‌ను ద‌క్కించుకుంది. దీంతో ఎంపీపీ స్థానాల‌ను ద‌క్కించుకునే స్థాయిలో వైసీపీ మెజారిటీ ద‌క్కించుకోలేక పోయింది. ఈ క్ర‌మంలో ఆయా స్థానాల్లో టీడీపీ-జ‌న‌సేన క‌నుక స‌ర్దుబాటు ధోర‌ణితో ముందుకు సాగితే.. ఇక్క‌డ వైసీపీకి అడ్డుక‌ట్ట వేసే అవ‌కాశం ఉంది. ఈ స్థానాల‌ను టీడీపీ ద‌క్కించుకునే ఛాన్స్ క‌నిపిస్తోంది.

ఉదాహ‌ర‌ణ‌కు.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా వైసీపీ 6 చోట్ల, టీడీపీ 7, జనసేన 4 చోట్ల విజయం సాధించాయి. అంటే.. వైసీపీకి ఏక‌ప‌క్ష విజ‌యం ద‌క్క‌లేదు. నియోజకవర్గ పరిధిలోని మిగిలిన మూడు మండలాల్లో మాత్రం అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసి మండల పరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకునే అవ‌కాశం ల‌భించింది. అంటే.. టీడీపీ 7, జ‌న‌సేన 4 క‌లిస్తే.. 11స్థానాల‌తో మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్ష పీఠం టీడీపీ ద‌క్కించుకునే ఛాన్స్ ఉంది.

అదేవిధంగా గుంటూరు జిల్లా మంగ‌ళగిరిని తీసుకున్నా.. దుగ్గిరాల మండలంలో పోటీకి నిలిచిన టీడీపీ.. అక్కడ అధికార పార్టీకి షాక్ ఇచ్చింది. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలు ఉండగా మెజార్టీ స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక్కడ టీడీపీ 9, వైఎస్ఆర్సీపీ 8, జనసేన 1 స్థానం గెలుపొందాయి. అంటే.. ఇక్క‌డ కూడా టీడీపీ+ జ‌న‌సేన క‌లిస్తే.. ఎంపీపీ స్థానాన్ని టీడీపీ ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. ఇలా.. కొన్ని చోట్ల టీడీపీ.. జ‌న‌సేన‌తో.. స‌ర్దుబాటు చేసుకుంటే.. ఎంపీపీ ప‌ద‌వులు ద‌క్కించుకునే అవ‌కాశంఉంది.

అయితే.. ఈ స‌ర్దుబాటు ఉంటుందా? ఉండ‌దా? అనే రాజ‌కీయ చ‌ర్చ‌ల‌కు చెక్ పెడుతూ.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీపీ స్థానాలకు అవకాశం ఉన్నచోట్ల జనసేనతో సర్దుబాటు చేసుకుంటామని ఆయన తెలిపారు. ఎన్నికలలో కూడా జనసేనతో సర్దుబాటు చేసుకునే స్థానికంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఇప్పుడు గోరంట్ల చేసిన వ్యాఖ్య‌లు .. టీడీపీ అధినేత చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు చేశారా? లేక సొంత వ్యాఖ్యాలా? అనేది తేలాలి. ఎందుకంటే.. ప్ర‌స్తుతం జ‌న‌సేన... బీజేపీతో పొత్తును కొన‌సాగిస్తుండ‌డ‌మే! మ‌రి చూడాలి ఏంజ‌రుగుతుందో.


Tags:    

Similar News