కుప్పం కాదు బాస్.. ఫ‌స్ట్ పులివెందుల చూసుకో!

Update: 2022-08-03 08:32 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌ని వైఎస్ జ‌గ‌న్ ఉవ్విళ్లూరుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని ఆయ‌న పార్టీ నేత‌ల‌కు కూడా నూరిపోస్తున్నారు. అయితే 175కి 175 కాద‌ని.. జ‌గ‌న్ ముందు పులివెందుల‌లో గెల‌వ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని టీడీపీ, జ‌న‌సేన నేత‌లు అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు కొంత‌మందిలోనూ ఈ భ‌యం ఉంద‌ని చెబుతున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిని, మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్‌ని, అలాగే జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ నుంచి పోటీ చేస్తే అక్క‌డ ఓడించ‌డానికి ఇప్ప‌టి నుంచే వైఎస్సార్సీపీ వ్యూహాలు ప‌న్నుతోంద‌ని అంటున్నారు. అయితే త‌మ నియోజ‌క‌వ‌ర్గాల సంగ‌తి త‌ర్వాత ముందు జ‌గ‌న్ పులివెందుల‌లో గెల‌వ‌డ‌మే క‌ష్ట‌మ‌ని టీడీపీ, జ‌న‌సేన వ‌ర్గాలు అంటున్నాయి.

తాజాగా పులివెందుల వైఎస్సార్సీపీ నేత‌లు తాడేప‌ల్లి సీఎం క్యాంప్ ఆఫీసుకొచ్చి గోడు వెల్ల‌బోసుకున్నార‌ని గుర్తు చేస్తున్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యాక పులివెందుల‌కు ఒరిగిందేమీ లేద‌ని తాము అన‌డం కాద‌ని.. వైఎస్సార్సీపీ నేత‌లే అంటున్నార‌ని టీడీపీ, జ‌నసేన వ‌ర్గాలు చెబుతున్నాయి. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్ల‌కు జ‌గ‌న్ బిల్లులు చెల్లించ‌డం లేద‌ని, రైతుల‌కు యంత్ర ప‌రికరాలు కూడా ఇవ్వ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే విష‌యాన్ని సోష‌ల్ మీడియా సాక్షిగానూ వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు పోస్టు చేస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష నేతలు చెబుతున్నారు.

జ‌గ‌న్ అతివిశ్వాసంతో ముందుకు వెళ్తున్నార‌ని.. అయితే పులివెందులలోనే జ‌గ‌న్ కు ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు అంటున్నారు. ఈ మూడేళ్ల‌లో జ‌గ‌న్ చేసిన అభివృద్ధి ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేదని చెబుతున్నారు. తాను బ‌ట‌న్ నొక్కుతాన‌ని.. మీరు నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గండ‌ని త‌న పార్టీ నేత‌ల‌కు సీఎం స్వ‌యంగా చెబుతున్నార‌ని అంటున్నారు. అంటే బ‌ట‌న్ నొక్క‌డం త‌ప్ప జ‌గ‌న్ కు మ‌రేమీ తెలియ‌ద‌ని ఆయ‌న ఒప్పుకుంటున్నార‌ని గుర్తు చేస్తున్నారు.

ప్ర‌శాంత్ కిషోర్ తో చేయించుకున్న స‌ర్వేలు కూడా జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. అందుకే ముఖ్య‌మంత్రి అస‌హ‌నానికి గురై త‌న వెంట్రుక కూడా పీక‌లేరంటూ ఫ్ర‌స్టేష‌న్ కు గుర‌వుతున్నాడ‌ని అంటున్నారు. ఓట‌మి భ‌యాన్ని గుర్తించే మీరే నాకు అండ మీరే అంటూ ప్ర‌జ‌ల‌ను ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్‌కు జ‌గ‌న్ గురి చేస్తున్నార‌ని ఎద్దేవా చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పులివెందుల ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు షాకివ్వ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని తేల్చిచెబుతున్నారు. కుప్పం, మంగ‌ళ‌గిరి, ప‌వ‌న్ పోటీ చేసే చోట సంగ‌తి దేవుడెరుగు. ముందు జ‌గ‌న్ పులివెందులలో గెలిస్తే అది ప‌దివేలు అని నొక్కి వ‌క్కాణిస్తున్నారు.
Tags:    

Similar News