లోకేష్ పాదయాత్ర వద్దు... బాలక్రిష్ణ పాదయాత్ర చేయాలి

Update: 2022-09-27 08:22 GMT
ఏపీలో పాదయాత్రల సీజన్ స్టార్ట్ అవలేదు కానీ దానికి సంబంధించిన న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతోంది. దానికి కారణం ఎన్నికలు దగ్గరపడుతూండడమే. 2004 ముందు నుంచి పాదయాత్ర ఏపీలో రాజకీయాలకు అతి పెద్ద ముడి సరుకు అయిపోయింది. పైగా సెంటిమెంట్ పరంగా చూసినా బాగా వర్కౌట్ అవుతోంది. నాడు వైఎస్సార్, ఆ మీదట చంద్రబాబు, ఇక జగన్   వరసగా పాదయాత్రలు చేసే ముఖ్యమంత్రులు అయ్యారు.

దాంతో 2024 ఎన్నికల ముందు పాదయాత్ర ఎవరిది ఉంటుంది అన్నదే కీలకమైన చర్చగా ఉందిపుడు. పాదయాత్ర ప్రతిపక్ష నాయకులకు వజ్రాయుధం. అలా కనుక చూసుకుంటే టీడీపీ జనసేనలకు ఆ అవకాకాశం ఉంది. అయితే పవన్ తాను పాదయాత్రకు దూరం అంటున్నారు. ఇక తెలుగుదేశం భావి వారసుడు లోకేష్ చూస్తే  తెగ ఉత్సాహపడుతున్నారు. దాంతో పాటు కొత్త ఏడాది సరికొత్తగా లోకేష్ పాదయాత్రతో జనం ముందుకు వస్తారని వార్తలు ఒక్కటే హడావుడి చేస్తున్నాయి.

చిత్రమేంటి అంటే లోకేష్ పాదయాత్ర చేస్తారు అని వార్తలు ఎంతలా వచ్చినా టీడీపీ క్యాడర్ లో మాత్రం దానికి సంబంధించి పెద్దగా స్పందన అయితే కనిపించడంలేదు అంటున్నారు. లోకేష్ పాదయాత్రలో ఎక్కడ అనవరసంగా నోరు జారుతారో, అది చివరికి టీడీపీకి మైనస్ గా మారి మరోసారి వైసీపీకి చాన్స్ ఇస్తుందేమో అని టీడీపీ క్యాడర్ ఒక్క లెక్కన భయపడుతున్నారు కూడా.

ఒక లోకేష్ విషయం చూస్తే ఆయన ఏపీలో ప్రముఖ నాయకుడి కుమారుడుగా ఈ రోజుకీ ఉన్నారు. అంతే తప్ప తనకంటూ ప్రత్యేక పొలిటికల్  ఇమేజ్ ని ఆయన తెచ్చుకోలేదు. లోకేష్ అంటే కేరాఫ్ చంద్రబాబు అనే అంతా అంటారు. ఆయన రాజకీయ అనుభవం తక్కువ. పైగా ఆయన సాధించింది కూడా పెద్దగా ఏమీ లేదు. దాంతో లోకేష్ పాదయాత్ర అనగానే సాదర జనంలో కూడా క్యూరియాసిటీ ఏదీ పెద్దగా కంపించడం లేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి.

ఇక ఈ మధ్యనే తన తండ్రి ఎన్టీయార్ పేరుని హెల్త్ వర్శిటీ నుంచి తీసేశారు అని హాట్ హాట్ ట్వీట్ చేసి వైసీపీ మీద నందమూరి నట సింహం బాలయ్య  పాలిటిక్స్ లో వేడి రగిల్చారు. ఒక్క ట్వీటే కానీ టీడీపీ క్యాడర్ లో కూడా ఆయన ఉత్సాహం రెట్టింపు చేశారు. పైగా బాలయ్య సీనియర్ నటుడు. ఆయనకు అపారమైన సినిమా అభిమానులు ఉన్నారు. ఇక ఎన్టీయార్ కి కుమారుడు. ఇక లెక్కలు చూసుకుంటే బాలయ్య‌ పాదయాత్ర కనుక చేస్తే ఆ ఊపే వేరుగా ఉంటుంది అని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలీ అంటే లోకేష్ కంటే బాలయ్య పాదయాత్ర చేస్తే టీడీపీకి ఎంతో కొంత రాజకీయ లాభం సమకూరుతుంది అన్న వారూ అదే పార్టీలో ఎక్కువ మంది ఉన్నారని అంటున్నారు. ఎన్టీయార్ బ్లడ్ కాబట్టి అన్న గారి ఫ్యాన్స్ కూడా టీడీపీ వైపు టర్న్ అయితే అదనపు ఓట్లు ఆ పార్టీకి కలసివస్తాయని కూడా అంచనా కడుతున్నారు. బాలయ్య పాదయాత్ర అంటూ మొదలెడితే నాడు అన్న ఎన్టీయార్ తరహాలో చైతన్య రధం ఉమ్మడి ఏపీని ఊపినట్లు కాకపోయినా బాగానే ప్రభంజనం సృష్టించవచ్చు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట కూడా.

అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది. తాను తన కుమారుడు లోకేష్ తప్ప టీడీపీ మీద ఏ నీడ పడకూడదు, ఎవరూ పార్టీలో హైలెట్ కాకూడదు అని ఒట్టేసుకుని కూర్చున్న చంద్రబాబుకు బావమరిది బాలయ్య బలం తెలియకుండా ఉంటుందా. అయినా సరే ఆయన్ని పక్కన పెట్టేసి కొడుకునే జనంలోకి పంపాలనుకుంటున్నారు అంటే అదే కదా టీడీపీ అంతర్గత రాజకీయ చిత్రమని అంటున్నారు. ఏది ఏమైనా బాలయ్య తన తండ్రి పార్టీ అధికారంలోకి రావడం కోసం బావకు నచ్చచెబుతారో, లేక తానుగా డెసిషన్ తీసుకుని జనాల్లోకి వస్తారో ఏమో తెలియదు కానీ బాలయ్య వస్తే మాత్రం వైసీపీకి గట్టి దెబ్బ పడుతుంది అన్నది నిజమని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News