పులివెందుల ఊసు : చంద్ర‌బాబు బీటెక్ కౌంటర్ ఫ‌లించేనా?

Update: 2022-02-28 05:29 GMT
పులివెందుల పులిబిడ్డ‌ను నేను అని చెప్పుకుంటారు జ‌గ‌న్. అదే స్థాయిలో రోజా కూడా అదే మాట అంటుంటారు కూడా! ఆమె అనే కాదు దాదాపు చాలా మంది వైసీపీ నాయ‌కులు త‌మ నేత పులివెందుల పులిబిడ్డ అని చెప్పి మురిసిపోతుంటారు.ఈ ద‌శ‌లో ఆయ‌న‌కు దీటుగా ఆయ‌న‌కు పోటీ ఇచ్చేందుకు  బీటెక్ రవి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌ను న్నారు. పార్టీ నుంచి వెళ్లిన వాళ్లు వెన‌క్కు వ‌చ్చినా స‌రే జ‌గ‌న్ పై  పోటీ చేసే అభ్య‌ర్థి బీటెక్ ర‌వి మాత్ర‌మేన‌ని తేల్చారు చంద్ర‌బాబు.

ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన డిక్ల‌రేష‌న్ కూడా ఇచ్చేశారు.అంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ తో బీటెక్ ర‌వి త‌ల‌ప‌డ‌డం దాదాపు ఖాయం.వాస్త‌వానికి ఎప్ప‌టి నుంచో క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్న బీటెక్ ర‌వి ఓ ప‌ర్యాయం ఎమ్మెల్సీగా కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.టీడీపీకి పూర్తి విధేయుడు..అదేవిధంగా జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌డంలో క‌డు స‌మ‌ర్థుడు అని అధినాయ‌క గ‌ణం భావిస్తోంది.

మరోవైపు చంద్ర‌బాబు సైతం ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ప‌ట్టు బిగించేందుకు పావులు క‌దుపుతున్నారు.వైఎస్ వివేకా హ‌త్య కేసును రాజ‌కీయంగా మ‌లుచుకునేందుకు, వ్య‌వ‌స్థీకృత వైఫ‌ల్యాల‌ను వివ‌రించి అటుపై సునీత‌కు మద్దతుగా మాట్లాడుతూ, పొలిటిక‌ల్ హీట్ పెంచేందుకు త‌ద్వారా మైలేజీ అందుకునేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.మొద‌ట్లో పులివెందుల బ‌రిలో సునీత ఉంటారు అని భావించారు.వైఎస్ వివేకా కూతురు కావ‌డంతో జ‌గ‌న్ కు గ‌ట్టి పోటీ ఇస్తార‌ని భావించారు.

కానీ ఎందుక‌నో  ఆ ఈక్వేష‌న్ వ‌ర్కౌట్ కాలేదు.వైఎస్ జ‌గ‌న్ ను స‌మ‌ర్థంగా ఎదుర్కొని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీమ‌లో మంచి ఫ‌లితాలు సాధించేందుకు ఆరంభంగా బీటెక్ ర‌వి నియామ‌కం పూర్తి చేసిన‌ట్లు చంద్ర‌బాబు వ‌ర్గం అనుకుంటోంది. ముఖ్యంగా సీమ‌లో పాగా వేయాలంటే క‌డ‌ప నుంచి ముఖ్యంగా పులివెందుల నుంచి అడుగులు ప‌డితే మార్పు అన్న‌ది సాధ్యం అవుతుంది అన్న‌ది చంద్ర‌బాబు న‌మ్మ‌కం.

ఇందులో భాగంగానే బాబు కూడా సీమ రాజ‌కీయ నాయ‌కుల న‌డ‌వడి వైపే కాదు ఇక్క‌డి ప‌రిణామాల్లో వ‌స్తున్న మార్పుల‌ను త‌న‌కు అనుగుణంగా మార్చుకునే మ‌రియు మలుచుకునే అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా చేరిక‌ల‌ను ప్రోత్సహిస్తూ జ‌గ‌న్ వ్యూహాల‌కు చెక్ పెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.ముఖ్యంగా సొంత బాబాయ్ చనిపోతే, ఆ కుటుంబానికి న్యాయం చేయలేని జ‌గ‌న్ ఇక రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారు అన్న ప్ర‌శ్న ఒక‌టి టీడీపీ అనుకూల మీడియా నుంచి బ‌లీయంగా వినిపించేలా చేస్తూ ఉన్నారు.

త‌ద్వారా సానుభూతి రాజ‌కీయాల‌ను త‌మ‌కు అనుగుణంగా  మ‌లుచుకుని ప‌రిణామాల్లో  మార్పున‌కు ప్ర‌తినిధిగా టీడీపీ ఉండాల‌ని ఆరాట ప‌డుతోంది.నాటి ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థి స‌తీశ్ రెడ్డి పై 90,543 మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు.ప్ర‌స్తుతం స‌తీశ్ రెడ్డి టీడీపీ రాజ‌కీయాల్లో లేరు.ఒక‌వేళ వెన‌క్కు వ‌చ్చి పార్టీ తీర్థం మ‌ళ్లీ పుచ్చుకున్నా కూడా ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేదే లేద‌ని చంద్ర‌బాబు చెబుతున్నారు.దీంతో ఎన్నిక‌ల‌కు రెండేళ్లు ముందుగానే పులివెందుల పోరుకు సంబంధించి అభ్య‌ర్థి ఎవ‌రు అన్న‌ది తేలిపోయింది.ఇక ఎన్నిక‌ల ర‌ణ‌మే మిగిలి ఉంది.
Tags:    

Similar News