టీడీపీతో పొత్తుకే మొగ్గు... ఆ నంబర్ మీద జనసేన పట్టు...?

Update: 2022-12-27 03:59 GMT
ఏపీలో పొత్తులు దాదాపుగా ఖరారు అయినట్లే అనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి ఎటూ తెలుగుదేశం పార్టీ రెడీగా లేదు. అదే టైం లో జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వమని పదే పదే చెబుతోంది. దీని భావమేంటి అంటే కచ్చితంగా పొత్తులతోనే ముందుకు సాగాలన్నదే అని వైసీపీ వారు వక్ర భాష్యం చెబుతున్నారు. అయితే అదే అసలైన అర్ధం అని జనసేన వైఖరి బట్టి కూడా తెలుస్తోంది అంటున్నారు.

ఈ మధ్యనే బీజేపీ నేతలు విజయవాడ వేదికగా నిర్వహించిన సుపరిపాలన సదస్సుకు మిత్రపక్షం  జనసేనని ఆహ్వానిస్తే వారు వెళ్ళలేదు. ఇక బీజేపీ జనసేన కలసి రోడ్ మ్యాప్ రెడీ చేసుకుని ముందుకు సాగుతారని, ఒక కో ఆర్డినేషన్ కమిటీని కూడా నియమించుకుంటారని వార్తలు వచ్చినా కూడా అవి ఏవీ నిజం కాదు అన్నట్లుగానే జనసేన నుంచి సమాచారం వస్తోంది అంటే బీజేపీతో కలసి నడిచేందుకు జనసేనకు పెద్దగా ఇష్టం లేదు అనే అంటున్నారు.

అదే టైం లో అనధికారికంగా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు కలసే ఉంటున్నాయని అంటున్నారు. ఈ రెండు పార్టీలకు చెందిన వారు కూడా పరస్పరం సహకరించుకునే ధోరణిలోనే వెళ్తున్నారు అని తెలుస్తోంది. ఇక జనసేనకు పొత్తుల పట్ల ఆసక్తి ఉన్నా టీడీపీ నుంచి ఎన్ని సీట్లు రాబట్టాలన్నదే కీలకమైన చర్చగా ఉందిట. టీడీపీ శిబిరం నుంచి అందుతున్న సమాచారం బట్టి చూస్తే పదిహేను నుంచి మొదలుపెట్టి పాతికతో ముగించాలని చూస్తున్నట్లుగా వెల్లడవుతోంది.

అదే జనసేన విషయం తీసుకుంటే యాభై సీట్లకు పట్టు పట్టి నలభై సీట్లు సాధించాలని చూస్తున్నారుట. అంటే టీడీపీ అనుకున్న సీట్లకు డబులు అన్న మాట. మరి తెలుగుదేశం ఎన్నో సార్లు పొత్తులను కుదుర్చుకుంది. ఎపుడూ కూడా మిత్రపక్షాలకు డజన్ సీట్లకు మించి ఇచ్చినది లేదు. ఉమ్మడి ఏపీలో ఎన్టీయార్  హయాంలో మాత్రం వామపక్షాలకు 1994 ఎన్నికల్లో దాదాపుగా నలభై సీట్ల వరకూ ఇస్తే వారు ముప్పయి దాకా గెలుచుకున్నారు. అదే అతి పెద్ద నంబర్.

ఇక విభజన ఏపీలో 175 సీట్లలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇచ్చినది అచ్చంగా 12సీట్లు మాత్రమే. అయితే బీజేపీ వామపక్షాలతో పోలిస్తే జనసేన ప్రభావంతమైన పార్టీగా తెలుగుదేశం చూస్తోంది. కాబట్టే ఆ సంఖ్యను డబుల్ చేస్తోంది అని అంటున్నారు. అంటే గరిష్టంగా పాతిక సీట్ల దాకా ఇస్తామని తెలుగుదేశం నుంచి వస్తున్న మ్యాటర్. అయితే పాతిక సీట్లు తీసుకుంటే అందులో గెలిచేవి ఏ పదిహేనో అయితే తక్కువ నంబర్ గా  అసెంబ్లీలో ఉంటుంది పైగా తాము 2029లో అధికారంలోకి రావడానికి ఆ నంబర్ సరిపోదని, గ్రౌండ్ లెవెల్ లో స్ట్రాంగ్ కావాలంటే కుదరదని జనసేన భావిస్తోందిట.

దాంతో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలభై సీట్లు ఇస్తే అందులో కనీసంగా ముప్పయి సీట్లు గెలుచుకుని అసెంబ్లీలో బలమైన పక్షంగా అవతరించాలి అని నిర్ణయించుకున్నారని అంటునారు.

అయితే నలభై సీట్లు జనసేనకు ఇస్తే కనుక అది తెలుగుదేశం చరిత్రలోనే అతి పెద్ద నంబర్ పొత్తులో ఇచ్చినట్లు అవుతుంది. ఏపీలో చూస్తే అంత నంబర్ లో సీట్లు జనసేనకు ఇస్తే తెలుగుదేశంలోనూ అలజడి రేగుతుంది అని అంటున్నారు.

ఈ విషయాలు ఎలా ఉన్నా తాము కోరుకున్న నంబర్ కోసమే జన్సేన తెలుగుదేశం మీద వివిధ మార్గాల ద్వారా వత్తిడి పెడుతోంది అని అంటున్నారు. మరి తెలుగుదేశం తలొగ్గి ఆ నంబర్ ఇస్తుందా అన్నది చూడాలి. మొత్తం సీట్లలో 40 జనసేనకు ఇస్తే 135 సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తే సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు దక్కించుకోగలమా అన్నది తెలుగుదేశం ఆలోచిస్తోందని అంటున్నారు.

ఏపీలో ప్రస్తుతానికి వైసీపీకి వ్యతిరేకత ఉన్నా ఏకపక్షంగా తెలుగుదేశం గెలిచేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. మరో ఆరు నెలల తరువాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి అంతవరకూ ఈ పొత్తుల కధ ఆగుతుందా లేకపోతే ముందే తేల్చుకుంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా నలభై నంబర్ మీద మాత్రం జనసేన పట్టుబట్టి కూర్చుందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News