మంత్రుల్ని బాబు అవమానించారా?

Update: 2016-08-17 06:53 GMT
వ్యూహం ఏమిటో కానీ తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై ఏపీ మంత్రులు గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంపై కొందరు మంత్రులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. సొంత జనాల ముందు తమను తక్కువ చేసేలా చేసిన చంద్రబాబు తీరుపై వారు లోగుట్టుగా గుస్సా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పాలనలోమంత్రులకు అవకాశం ఇవ్వకుండా మొత్తం తానే అన్నట్లుగా ఫోకస్ అయ్యే చంద్రబాబు కారణంగా.. కష్టపడి పని చేస్తున్న మంత్రులు ఫోకస్ కాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. సరైన కారణంగా లేకుండానే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఏదైనా వ్యూహంతో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే ఆ విషయాన్ని మంత్రులతో చెప్పాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండానే.. తాను చెప్పినట్లు వినాలంటూ ఆయన వ్యవహరించిన తీరుపై ఆగ్రహం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇంతకు జరిగిందేమంటే.. పంద్రాగస్టు సందర్భంగా వివిధ జిల్లాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల మంత్రులకు అప్పగించకుండా ఇతర జిల్లాలకు చెందిన మంత్రుల చేత జెండా ఆవిష్కరణ చేయించటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఎవరి జిల్లాకు వారిని వదిలేస్తే అయిపోయేదానికి.. ఒక జిల్లాకు మరో జిల్లాకు చెందిన వారి చేత జెండా ఆవిష్కరణతో బాబు సాధించిందేమిటన్న ప్రశ్నను సంధిస్తున్నారు. పంద్రగస్టు.. జనవరి 26 సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని అయితే ఆయా జిల్లా మంత్రులు లేదంటే ఇన్ ఛార్జ్ మంత్రులు పూర్తి చేస్తారు. కానీ.. ఆ సంప్రదాయానికి భిన్నంగా జిల్లాకు ఏ మాత్రం సంబంధం లేని మంత్రుల చేత జెండా ఆవిష్కరించేలా చేయటం పై అంతృప్తి వ్యక్తమవుతోంది.  విశాఖలో యనమల చేత జెండా ఆవిష్కరించటం ద్వారా ఆ జిల్లాకు చెందిన అయ్యన్నపాత్రుడు ఫీలయ్యే పరిస్థితి.

ప్రకాశం జిల్లాలో ఉన్న మంత్రి శిద్ధారాఘవరావుకు జెండా ఆవిష్కరణ చేయాల్సి ఉన్నా.. ఆయన స్థానే గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి రావెల కిషోర్ పతాక ఆవిష్కరించేలా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాతకు అవకాశం ఇవ్వకుండా.. మంత్రి మాణిక్యాలరావుతో జెండా ఎగురవేసేలా చేశారు. ఇలా ఒకరి జిల్లాకు సంబంధించిన మంత్రిని మరో జిల్లాలో జెండా ఎగురవేయించటం ద్వారా ఆయా జిల్లాల మంత్రులు చిన్నబోయేలా చేసిన చంద్రబాబు.. తాను అనుకున్నది చేయటం ద్వారా సాధించిందేమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News