ఈ దమ్ము ముద్రగడ విషయంలో చూపాలి సార్!

Update: 2017-10-25 15:30 GMT
జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ మార్కు మైండ్ గేం ప్రారంభించారు. మంత్రులు కొందరు కలిసి ప్రెస్  మీట్ పెట్టి.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిరాటంకంగా సాగాలనే తాము కోరుకుంటున్నాం అని, అనుమతులు ఇవ్వకుండా ఆ యాత్రను అడ్డుకోబోయేది కూడా లేదని, ఆయన పాదయాత్ర చేయడం వల్ల తమకు లాభమేనని సెలవిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే నాయకుడు చేయబోయే పాదయాత్ర వల్ల తమకు లాభమే జరుగుతుందనే వ్యాఖ్యలు వెటకారం నిండినవే అని - వైసీపీ నేతల స్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఇలా మాట్లాడుతున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే... ఇవే మాటల్ని ముద్రగడ పద్మనాభం చేయదలచుకున్న పాదయాత్ర విషయంలో చెప్పే దమ్ము తెలుగుదేశం మంత్రులకు ఎందుకు లేకుండా పోయిందనే ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తోంది!

జగన్ పాదయాత్ర చేస్తే తమకు లాభం అంటున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి మాటల్లోనే ఈ తెలుగుదేశం ప్రభుత్వం విపక్షాల పట్ల ఎంతో కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదనే సంగతి బయటపడిపోతున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంటే ప్రభుత్వం తమకు లాభం కింద భావించేట్లయితే.. ఆ యాత్రలకు అనుమతులు ఇస్తారు. తమ ప్రభుత్వం బండారం బయటపడుతుందని - పరువు పోతుందని, తమ అరాచకాలు వెలుగులోకి వస్తాయని భయం పుడితే.. అలాంటి ప్రజా ఉద్యమాలకు వారు మద్దతు ఇవ్వరు అన్న అర్థం స్ఫురించేలా మంత్రి మాటలు ఉన్నాయని పలువురు అంటున్నారు.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను - పాదయాత్రలను అణచివేయడం ముద్రగడ విషయంలో మాత్రమే జరుగుతున్నది ఎంతమాత్రమూ కాదు. కాపుల ఉద్యమాలను అణిచేస్తున్నట్లుగానే ఆ నడుమ మాదిగలు చేయదలచుకున్న మహా యాత్రను కూడా పోలీసులతోనే అణిచేశారు. అలాగే వామపక్షాలు నిర్వహించే అనేక ప్రజా ఉద్యమాలకు - ప్రత్యేకించి ఉత్తరాంధ్రలోనూ - ఆక్వాపార్క్ కు వ్యతిరేకంగానూ జరిగే ప్రజాందోళనల్ని ఎలా అణచివేశారో మనం గమనించాం. అందుకే ప్రభుత్వం చిత్తశుద్ధి గురించి ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మీకు చేతనైతే అన్ని ప్రజాందోళనలకు అనుమతులు ఇచ్చి.. మీ పాలన బాగుందనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేలా చూసుకోవాలి గానీ.. మీ బండారం బయటపెట్టే వాటన్నింటినీ తొక్కేసి, జగన్ యాత్రను అడ్డుకుంటే.. రభస అయిపోతుందని భయం గనుక.. అది జరిగితే లాభం అంటూ డొంకతిరుగుడు  మాటలు చెబితే నమ్మేవారుండరని ప్రజలు అంటున్నారు.
Tags:    

Similar News