జేసీ బ్రదర్స్ కు షాకిచ్చిన సొంత నేతలు

Update: 2020-12-27 06:50 GMT
ఇపుడు జేసీ బ్రదర్స్ కు రెండు విధాలుగా షాకులు తగిలాయి. మొదటిదేమో ప్రత్యర్ధి, అధికారపార్టీ నేతల నుండి. ఇక రెండో షాకేమో సొంతపార్టీ నేతల నుండే. మొదటి షాకును జేసీ బ్రదర్స్ ఎప్పటి నుండో ఊహిస్తున్నదే కాబట్టి అందుకు తగ్గ ప్రిపరేషన్లోనే ఉన్నారు. కానీ రెండో షాకే బ్రదర్స్ కు చాలా గట్టిగా తగిలినట్లుంది. తాజాగా జేసీ బ్రదర్స్ వ్యవహార శైలి చూస్తుంటే మొదటి షాక్ కన్నా రెండోషాకే చాలా బలంగా తగిలినట్లు అనుమానంగా ఉంది.

టీడీపీ అధికారంలో ఉన్నపుడు జేసీ బ్రదర్స్ అరాచకాలు అన్నీ ఇన్నీ కావని జిల్లాలో ఎవరినడిగినా చెబుతారు. అప్పట్లో జేసీల హవా ఆ విధంగా నడిచింది. ఇపుడు వైసీపీ ఎంఎల్ఏ, అప్పటి ప్రత్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన మద్దతుదారులపై ఎన్ని కేసులు పెట్టారు ? ఎన్నిసార్లు జైలుకు పంపారన్నది జిల్లాలో అందరికీ తెలిసిందే. జేసీల దిష్టిబొమ్మల దహనం కేసుల్లో కూడా తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారంటూ అప్పట్లో పెద్దారెడ్డి ఎన్నోసార్లు మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదు. అంటే ఎప్పటికీ టీడీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబునాయుడు లాగే వీళ్ళు కూడా భ్రమపడ్డారు.

సీన్ కట్ చేస్తే ఐదేళ్ళకే చక్రం తిరగబడింది. అప్పటి ప్రత్యర్ధి ఇపుడు ఎంఎల్ఏ అవ్వటమే కాకుండా వైసీపీ ఘన విజయంతో అధికారంలోకి వచ్చింది. దాంతో సహజంగానే బాధితులందరు జేసీలకు వ్యతిరేకంగా ఏకమవ్వటమే కాకుండా యాక్టివ్ అయ్యారు. ఫలితంగా జేసీల అప్పటి యాక్షన్ కు ఇపుడు రియాక్షన్ కనిపిస్తోంది. అసలే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరైనా తాడిపత్రిలో బలమైన రెండువర్గాల మధ్య ఆధిపత్య పోరు జరిగితే ఎలాగుంటుందో ఇపుడు ప్రత్యక్షంగా కనబడుతోంది. దాని ఫలితమే మూడు రోజుల క్రితం ఎంఎల్ఏ పెద్దారెడ్డి తన మద్దతుదారులతో జేసీ ఇంటికెళ్ళటం.

సరే వీళ్ళ గొడవను పక్కన పెట్టేస్తే సొంత పార్టీ నేతల విషయమే జేసీ బ్రదర్స్ కు అంతుపట్టడం లేదు. ప్రత్యర్ధులు ఏకంగా ఇంటి మీదకు వస్తే పార్టీలో నేతలు పెద్దగా స్పందించకపోవటమే బ్రదర్స్ కు పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. మాజీమంత్రి పరిటాల సునీత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, మాజీ ఎంఎల్ఏలు, మాజీ ఎంపిలు ఇంతమంది ఉన్నా కనీసం ఒక్కళ్ళు కూడా దాడిని ఖండించలేదు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాత్రమే పెద్దారెడ్డి చర్యను తప్పుపట్టారు.

సొంతపార్టీలో నేతలు కూడా జేసీల విషయంలో ఎందుకు నోరిప్పటం లేదు ? ఎందుకంటే జేసీలంటేనే నోటి దురుసుకు ప్రతిరూపం. టీడీపీ హయాంలో ఎంపి, ఎంఎల్ఏగా ఉన్న జేసీలు సొంతపార్టీ నేతలను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. జిల్లాలోని దాదాపు 10 నియోజకవర్గాల్లోని ఎంఎల్ఏలకు ప్రత్యామ్నాయంగా తన వర్గాన్ని బలంగా నడిసారు. దాంతో మెజారిటి ఎంఎల్ఏలు జేసీలపై మండిపడ్డారు. కానీ వాళ్ళకున్న బలం ముందు సరితూగలేక మాట్లాడలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో అందరితో పాటు జేసీ బ్రదర్స్ కూడా ఓడిపోయారు. అయితే ఇంకెవరికీ లేని సమస్యలు జేసీలకు మాత్రమే ఎదురవుతోంది. దాంతో లోలోపల అందరు హ్యాపీగా ఫీలవుతున్నారని పార్టీలో టాక్. అందుకనే ఇపుడు జేసీల ఇబ్బందుల విషయంలో ఎవరు మాట్లాడటం లేదట.
Tags:    

Similar News