పొత్తుతో పార్టీకి స‌మాధి అంటున్న త‌మ్ముళ్లు

Update: 2018-08-29 01:30 GMT
చేసిన త‌ప్పులు ఊరికే పోవంటుంటారు. నిత్యం నీతులు వ‌ల్లించే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. త‌న మాట‌ల‌కు.. చేత‌ల‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు.  విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల గురించి స్పీచులు ఇచ్చే ఆయ‌న‌.. నిద్ర లేచింది మొద‌లు విలువ‌ల‌కు వ‌లువ‌లు తీసే రాజ‌కీయాల్నే చేస్తుంటారు. తెలంగాణ‌లో త‌న పార్టీ ఎమ్మెల్యేల్ని టీఆర్ఎస్ అధినేత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తప్పుప‌డుతూనే.. అదే ప‌నిని ఏపీలోని విప‌క్ష పార్టీపై చేయ‌టం బాబుకే చెల్లుతుంది.

త‌న త‌ప్పుల్ని తెర మీద‌కు తీసుకొచ్చి.. రాజ‌కీయంగా త‌న‌ను ఇబ్బంది పెడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంగా ప‌ని చేసిన బాబుకు ఇప్పుడు అదో పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఎన్నిక‌లు మ‌రో ఆర్నెల్ల‌లో ముంచుకొస్తున్న వేళ‌.. టీడీపీ నేత‌ల‌కు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అస్స‌లు కుద‌ర‌టం లేద‌న్న మాట వినిపిస్తోంది.

పార్టీని వీడి వ‌చ్చే ముందు ఇచ్చిన హామీల‌కు.. గ‌డిచిన కొంత‌కాలంగా జ‌రుగుతున్న దానికి ఏ మాత్రం పోలిక లేద‌న్న మాట వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి  వినిపిస్తోంది. త‌మ‌ను న‌మ్మిన జ‌గ‌న్ కు చేసిన మోసానికి త‌గిన ఫ‌లితాన్ని అనుభ‌విస్తున్న‌ట్లుగా వాపోతున్నారు. రోజులు గ‌డుస్తున్న కొద్దీ త‌మ ఇబ్బందులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయ‌ని వారు చెబుతున్నారు.

ఇప్పుడు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌టాన్ని వారు జీర్ణించుకోలేక‌పోతున్నారు. కాంగ్రెస్ తో పొత్తు విష‌యం టీడీపీలో కొత్త చిచ్చు రేపితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ‌చ్చిన జంప్ జిలానీలకు ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మకు సంబంధించిన సీట్ల స‌ర్దుబాటు విష‌యంలోనే కిందా మీదా ప‌డుతున్న వేళ‌.. కాంగ్రెస్ తో పొత్తు క‌న్ఫ‌ర్మ్ అయితే.. ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌ని చెబుతున్నారు.

సీట్ల స‌ర్దుబాటు విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. కాంగ్రెస్ తో పొత్తు మాట‌కే హ‌డ‌లిపోతున్నారు. విభ‌జ‌నకు కార‌ణ‌మైన కాంగ్రెస్ ను ఆంధ్ర ప్ర‌జ‌లు ఇప్ప‌టికి క్ష‌మించ‌టం లేద‌ని.. ఈ విష‌యాన్ని అర్థం చేసుకోని చంద్ర‌బాబు.. తెలంగాణ‌లో పార్టీ ప్ర‌యోజనం కోసం ఏపీలో పార్టీకి ఘోరీ క‌ట్టేలా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ర‌ని మండిప‌డుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ రెండు క‌ళ్ల సిద్ధాంతం పేరుతో ఏపీ ప్ర‌యోజ‌నాల్ని గాలికి విడిచి పెట్టి తెలంగాణ కోసం పాకులాడార‌ని.. చివ‌ర‌కు ఆయ‌న‌కు అధికారాన్ని అప్ప‌జెప్పింది ఏపీ ప్ర‌జ‌లేన‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెబుతున్నారు. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా ఏపీ ప్ర‌యోజ‌నాల కంటే కూడా తెలంగాణ‌లో పార్టీకి మేలు జ‌ర‌గాల‌న్న ఉద్దేశంతో బాబు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును తెలుగు త‌మ్ముళ్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇప్ప‌టికే కాంగ్రెస్ తో పొత్తు విష‌యంపై కేఈ.. అయ్య‌న్న‌పాత్రుడు లాంటి వారు త‌మ వ్య‌తిరేక‌త‌ను బాహాటంగానే చెప్ప‌టం తెలిసిందే. ఓప‌క్క పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు.. మ‌రోవైపు.. జ‌గ‌న్ పార్టీ నుంచి వ‌చ్చిన నేత‌ల కార‌ణంగా త‌లెత్తుతున్న ర‌చ్చ స‌రిపోన‌ట్లుగా కాంగ్రెస్ తో పొత్తు విష‌యంపై బాబు చూపుతున్న మోజు.. పార్టీని ముంచేయ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు తెలుగు త‌మ్ముళ్లు వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో అంత‌ర్గ‌తంగా అంత‌కంత‌కూ పెరుగుతున్న అసంతృప్తి జ్వాల పార్టీని ద‌హించేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌ని లేద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News