హోదా’ కోసం ఒక్కటైన టీడీపీ - వైసీపీ

Update: 2016-08-01 07:18 GMT
లోక్ సభలో ఈ రోజు అనూహ్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ.. మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడంలోనే ఎక్కువ సమయం గడిపే ఏపీలోని పాలక - విపక్షాలు టీడీపీ - వైసీపీలు కలిసిపోయాయి. రెండు పార్టీల నేతలు కలిసి రాష్ట్రంలోని ఉమ్మడి సమస్యపై నినదించారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో రెండు పార్టీల నేతలు రాష్ట్ర స్థాయిలో ఒకరినొకరు విమర్శించుకుంటున్నా లోక్ సభలో మాత్రం ఇద్దరూ కలిసే నడిచారు. దీంతో అందరి దృష్టీ వారిపైనే పడింది.

పార్లమెంటులో కొద్దిసేపటి క్రితం టీడీపీ - వైసీపీలు రెండూ దాదాపుగా కలిసిపోయాయి. కలిసికట్టుగా బీజేపీ తీరుపై విరుచుకుపడ్డాయి. తొలుత పార్లమెంటు సమావేశాలకు ముందు పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శన చేపట్టిన టీడీపీ ఎంపీలు చేతుల్లో ప్లకార్డులతోనే లోక్ సభలోకి ఎంటరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. టీడీపీ నేతల డిమాండ్లతో సభలో గందరగోళం నెలకొంది.  దాంతో సభలో ప్లకార్డులు చూపరాదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ టీడీపీ ఎంపీలకు సూచించారు. స్పీకర్ సూచనతో ఆగ్రహావేశాలకు గురైన టీడీపీ ఎంపీలు పోడియాన్ని చుట్టుముట్టారు.  అదేసమయంలో వైసీపీ ఎంపీలు కూడా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసనకు దిగారు.

దీంతో నిత్యం ఢీ అంటే ఢీ  అంటూ సాగే రెండు పార్టీల ఎంపీలు కలిసికట్టుగా కేంద్రంపైకి దూసుకెళ్లినట్లయింది. దీనికోసం ముందుగా నేతలు ఏమీ చర్చించుకోవడం కానీ, సంప్రదింపులు కానీ లేవు కానీ అప్పటికప్పుడు రెండు పార్టీల నేతలు పోడియంలోకి వెళ్లి కలిసికట్టుగా ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
Tags:    

Similar News