సైకిల్ దిగిపోతామంటున్న సీనియర్లు

Update: 2018-12-21 04:44 GMT
ఓ ప్రకటన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇబ్బందుల పాలు చేస్తోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి చేసినట్లుగానే తాను ముందుగా శాసనసభ ఎన్నికల్లో అభ్యర్ధులను ముందుగా ప్రకటిస్తానన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితికి - తెలుగుదేశం పార్టీకి మధ్య ఎంతో వ్యత్యాసముందనే విషయం చంద్రబాబు నాయుడికి ఈ ప్రకటన చేసినప్పుడు తెలియలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే అన్నీ. ఈ పార్టీలో ఏం జరగాలన్నా కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అంతే కాదు... ఎంతటి సీనియర్ నాయకులైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. వీటన్నింటితో పాటు ఆ పార్టీని ఒంటి చేత్తో గెలిపిస్తున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. 

ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏకఛత్రాధిపత్యం చెల్లదు. దీనికి కారణం ఆయనతో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నారు. పైగా చంద్రబాబు నాయుడు తన వారిని ఒక విధంగాను - తన వర్గం కాని వారిని మరో విధంగానూ చూస్తారనే పేరుంది. దీంతో పార్టీలో ఆయనను ధిక్కరించే వర్గం ఎప్పుడూ ఒకటి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అతి త్వరలో శాసనసభకు - లోక్‌ సభకు అభ్యర్ధులను ప్రకటిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడంతో టిక్కట్లు రావేమోననే భయం కొందరు సీనియర్లను వెంటాడుతోంది. టిక్కట్ రాక భంగపడి నియోజకవర్గంలో పరువు తీసేసుకోవడం కంటే ముందుగానే పార్టీని వీడితే మంచిదనే అభిప్రాయం సీనియర్లలో నెలకొంది. ఇలాంటి వారు ప్రతి జిల్లాలోనూ కనీసం ఇద్దరు - ముగ్గురు ఉంటారని అంటున్నారు. దీనికి తోడు కొందరు సిట్టింగు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా టిక్కట్ రాదనే ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారు ముందే సైకిల్ దిగిపోతే మంచిదనే అభిప్రాయంలో ఉన్నట్టు చెబుతున్నారు. వీటికి తోడు పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తామని చంద్రబాబు నాయుడు మాటిమాటికీ ప్రకటిస్తున్నారు. ఇది తమను పక్కనే పెట్టేందుకే అనే అభిప్రాయం సీనియర్ నాయకుల్లో బలంగా ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడికి పట్టం కట్టడంలో భాగంగా సీనియర్లను ఎసరు పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇది కూడా కొందరు తెలుగుదేశం సీనియర్ నాయకులు పార్టీ వీడేందుకు కారణమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

Tags:    

Similar News