టీడీపీ సీనియ‌ర్ సైలెంట్‌.. సైడ్ అవుతోన్న త‌మ్ముళ్లు ?

Update: 2021-05-21 03:26 GMT
కృష్ణా జిల్లా అవనిగడ్డ..టీడీపీకి కాస్త పట్టున్న నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావించక జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు పసుపు జెండానే ఎగిరింది. 1985, 1989, 1994, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఇక 1983, 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు రెండు కుటుంబాల మధ్యే నడుస్తాయి. మండలి, సింహాద్రి ఫ్యామిలీల మధ్య పోరు జరిగేది. గతంలో టీడీపీ తరుపున సింహాద్రి సత్యనారాయణ బరిలో ఉంటే, కాంగ్రెస్ తరుపున మండలి వెంకటకృష్ణరావు పోటీ చేసేవారు. ఇందులో మండలి మూడుసార్లు, సింహాద్రి మూడు సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత మండలి వారసుడుగా బుద్దప్రసాద్ రంగంలోకి దిగారు. ఈయన 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచారు.

ఇక 2009 ఎన్నికల్లో సింహాద్రి ఫ్యామిలీ ప్రజారాజ్యంలోకి వెళ్లింది. సింహాద్రికి స‌మీప బంధువే అయిన‌ రమేష్ ప్రజారాజ్యంలో పోటీ చేయగా, మండలి కాంగ్రెస్ నుంచి, అంబటి బ్రాహ్మణయ్య టీడీపీ నుంచి పోటీ చేశారు. ఈ త్రిముఖ పోరులో టీడీపీ గెలిచింది. 2014 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ నుంచి మండలి, వైసీపీ నుంచి రమేష్ బరిలో దిగారు. అప్పుడు మండలి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రమేష్ వైసీపీ తర‌పున గెలిచారు.
 ఇలా కొన్ని ద‌శాబ్దాల పాటు దివిసీమ రాజ‌కీయాల్లో ఈ రెండు కుటుంబాల‌కు చెందిన వారే పెత్త‌నం చేస్తూ వ‌స్తున్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాక మండలి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు పెద్దగా చేయడం లేదు. అటు రమేష్ ఎమ్మెల్యేగా దూకుడు కనబరుస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. పైగా ఇటీవ‌ల కోవిడ్ నేప‌థ్యంలో ఆయ‌న స్వ‌యంగా డాక్ట‌ర్ కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ధైర్యం నింప‌డంతో పాటు స్థానికంగా మ‌కాం వేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు బాగా ప్లస్ అవుతున్నాయి. దీంతో టీడీపీ కేడర్ సైతం వైసీపీ వైపుకు వెళ్లిపోతుంది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అవనిగడ్డలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ దాదాపు వన్‌సైడ్ విజయాలు సాధించింది. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ లోకల్ నాయకులు సైతం రమేష్‌ సమక్షంలో వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. మొత్తానికైతే మండలి యాక్టివ్‌గా లేకపోవడంతోనే దివిసీమ తమ్ముళ్ళు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మండ‌లికి బ‌దులుగా ఆ ఫ్యామిలీ నుంచి మూడో త‌రం వారసుడు ఎంట్రీ ఇస్తాడ‌ని అంటున్నారు.
Tags:    

Similar News