టికెట్లు ఎవ‌రికో.. స‌ర్వేలు తేలుస్తాయంటా!

Update: 2021-12-23 00:30 GMT
నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానం.. మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉన్న మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయం ప‌రంగా ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. జ‌గ‌న్ దెబ్బ‌కు 2019 ఎన్నిక‌ల్లో చావు దెబ్బ తిన్న ఆయ‌న‌.. పార్టీని తిరిగి బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించారు. వచ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా తిరిగి విజ‌యం సాధించ‌డం కోసం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. అందుకు పాత ప‌ద్ధ‌తిలో వెళ్తే ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని భావించిన ఆయ‌న‌.. త‌న తీరును మార్చుకుంటు స‌రికొత్త పంథాలో ముందుకు సాగుతున్నార‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను స‌ర్వేల ద్వారా నిర్ణ‌యిస్తార‌ని స‌మాచారం.

ఎప్పుడూ బాబే..
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు కేటాయించే విష‌యంలో టీడీపీ ఎన్న‌డూ లేని కొత్త విధానాన్ని అనుస‌రించ‌నుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. పార్టీని చేతుల్లోకి తీసుకున్న‌ప్ప‌టి నుంచి గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కూ పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను బాబే నిర్ణ‌యించేవారు. నాలుగు ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన పార్టీకి క్షేత్ర‌స్థాయిలో బ‌లం ఉంది కాబట్టి త‌న లెక్క‌లు తాను వేసుకుని అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేవారు. 1999 నుంచి వ‌రుస‌గా అయిదు ఎన్నిక‌ల్లోనూ బాబు త‌న సొంత అంచ‌నాల‌తోనే అభ్య‌ర్థుల‌ను నిర్ణ‌యించారు. పేరుకు స్క్రీనింగ్ క‌మిటీల వంటివి వేసినా అది నామ‌మాత్ర‌మే. బాబు అనుకున్న వాళ్ల‌కే టికెట్లు ద‌క్కేవి. ప్రాంతీయ పార్టీ కావ‌డంతో ఉన్న వెసులుబాటును బాబు ఉప‌యోగించుకున్నారు. కొన్నిసార్లు ఓట‌మి ఎదురైనా తిరిగి పుంజుకున్నారు.

కానీ ఇప్పుడు..
కానీ 2019 ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఆ త‌ర్వాత జ‌రిగిన వివిధ ఎన్నిక‌ల్లోనూ వైసీపీ చేతిలో టీడీపీ చిత్త‌వుతూనే ఉంది. దీంతో టీడీపీకి ద‌శాబ్దాలుగా అండ‌గా ఉన్న వ‌ర్గాలు సైతం ప‌క్క‌కు వెళ్లిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో పాత నాయ‌క‌త్వాన్ని న‌మ్ముకుంటే 2024 ఎన్నిక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని బాబు గ్ర‌హించారు. అందుకే త‌న‌కు తెలిసిన నేత‌ల కంటే కూడా ప్ర‌జ‌లు కోరుకుంటున్న వాళ్ల‌కు టికెట్లు కేటాయించాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చార‌ని తెలిసింది. అందు కోసం ఇప్ప‌టి నుంచే రాష్ట్రవ్యాప్తంగా స‌ర్వేలు చేయిస్తున్న‌ట్లు స‌మాచారం. త‌న స‌ల‌హాదారు రాబిన్ శ‌ర్మ నేతృత్వంలో ఓ స‌ర్వే కొన‌సాగుతుండ‌గా.. మ‌రో రెండు పేరున్న సంస్థ‌ల‌కు కూడా స‌ర్వే బాధ్య‌త‌ను బాబు అప్ప‌గించార‌ని టాక్‌. ఎన్నిక‌లు వ‌చ్చే లోపు మూడు ద‌ఫాలుగా స‌ర్వేలు చేసి బాబుకు నివేదిక‌లు అందించాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిసింది. ఈ స‌ర్వేల ప్ర‌కార‌మే అభ్య‌ర్థుల‌ను బాబు ఎంపిక చేస్తార‌ని వినికిడి. దీంతో ఇప్ప‌టి నుంచి టీడీపీ నేత‌ల్లో భ‌యం మొద‌లైంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.
Tags:    

Similar News