తీన్మార్ మల్లన్న అరెస్ట్ ల పరంపరం.. బెయిల్ వచ్చినా బయటకు రాడా?

Update: 2021-09-24 06:35 GMT
తెలంగాణ ప్రభుత్వంపై సోషల్ మీడియా సాక్షిగా యుద్ధం చేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియా ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న ఇప్పట్లో విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే ఓ జ్యోతిష్యుడిని రూ.30 లక్షల డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలపై అతడిని అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. తాజాగా నిన్న బెయిల్ పై బయటకు వచ్చిన తీన్మార్ మల్లన్నను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. ఈసారి మరో కొత్త కేసులో ఈ అరెస్ట్ చూపించారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం మళ్లీ చంచల్ గూడ జైలుకు పంపించారు.

కేసీఆర్ సర్కార్ ను, మంత్రులను టార్గెట్ చేసి ‘క్యూ న్యూస్’ అనే యూట్యూబ్ చానెల్ ద్వారా తీన్మార్ మల్లన్న చేసే క్రిటిసిజం తెలంగాణలో ఎంతో పాపులర్. ఆయన సునిశిత, హాస్యపు విమర్శలు సూటిగా తగులుతాయి. ఇప్పటికే ఎన్నో విమర్శలతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీన్మార్ మల్లన్నపై పలువురి ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి టార్గెట్ గా మారిన మల్లన్నపై పోలీసులు వరుస కేసులతో అరెస్ట్ ల మీద అరెస్ట్ లు చేస్తున్నారు.

తాజాగా నిజామాబాద్ లో కల్లు వ్యాపారి వద్ద మల్లన్న టీం డబ్బులు డిమాండ్ చేసిందన్న ఆరోపణలపై మల్లన్నతోపాటు ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి మల్లన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. మళ్లీ చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఏపీలో జగన్ సర్కార్ వచ్చాక కూడా టీడీపీ రెబల్ మాజీ ఎమ్మెల్యే చింతమనేని కూడా ఇలానే వరుసగా అరెస్ట్ అయ్యారు. జగన్ సర్కార్ తో ఢీ అంటే ఢీ అన్న అతడిని ఒక కేసులో బెయిల్ పై బయటకు రాగానే మరో కేసులో ఇరికించి దాదాపు ఆరేడు నెలల పాటు జైల్లోనే ఉంచారు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై కూడా అచ్చం అలాగే అరెస్ట్ లు అవుతుండడం చర్చనీయాంశమైంది.


Tags:    

Similar News