బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న

Update: 2021-12-07 09:31 GMT
జర్నలిస్టు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు, టీఆర్ ఎస్ ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వివిధ కేసులలో తీన్మార్ మల్లన్న దాదాపు 74 రోజులపాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరైంది.

టీఆర్ఎస్ తనను కక్ష సాధింపు ధోరణితో అనేక ఇబ్బందులకు గురిచేసిందని, లేనిపోని కేసులు పెట్టించి 74 రోజులు జైలుకు పంపిందని మల్లన్న గతంలో ఆరోపించారు.

ఈ క్రమంలోనే మల్లన్న బీజేపీలో చేరబోతున్నారని చాలాకాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ ఊహాగానాలను నిజం చేస్తూ తీన్మార్ మల్లన్న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు.

బీజేపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన మల్లన్న దూకుడు మరింత పెంచారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరుల స్తూపానికి కట్టేస్తానని షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణలో అత్యంత మోసకారి కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై 38 కేసులు పెట్టిన కేసీఆర్ ఏం సాధించారని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చడమే తన ధ్యేయమని, బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతానని అన్నారు. చింతపండు నవీన్ ను జనం తీన్మార్ మల్లన్నను చేశారని చెప్పారు.
Tags:    

Similar News