అనామిక‌ను చంపేసిన ఇంట‌ర్ బోర్డు..ఎలానంటే?

Update: 2019-06-02 04:47 GMT
తెలంగాణ ఇంట‌ర్ బోర్డు అడ్డంగా దొరికిపోయింది. నిలువెత్తు నిర్ల‌క్ష్యంతో వేలాది కుటుంబాల్లో వేద‌న‌ను నింపిన ఇంట‌ర్ బోర్డు అధికారులు.. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉన్నారు. సిర్పూరు కాగ‌జ్ న‌గ‌ర్ కు చెందిన అనామిక హైద‌రాబాద్ లో ఇంట‌ర్ చ‌దివారు. అన్ని స‌బ్జెక్ట్స్ లో మార్కులు బాగానే వ‌చ్చినా.. తెలుగులో 21 మార్కులు మాత్ర‌మే వ‌చ్చాయి. ఈ వేద‌న‌ను భ‌రించ‌లేని ఆమె ఆత్మహ‌త్య చేసుకుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఫెయిల్ అయిన విద్యార్థుల మార్కుల్ని మ‌రోమారు రీవెరిఫికేష‌న్ ప్ర‌క్రియ చేప‌ట్ట‌టం తెలిసిందే. తాజాగా వ‌చ్చిన ఈ ఫ‌లితాల్లో 48 మార్కుల‌తో అనామిక్ పాస్ అయిన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో.. అనామిక సోద‌రి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. 21 మార్కుల‌తో ఫెయిల్ అయిన‌ట్లుగా చూపించిన ఇంట‌ర్ బోర్డు తాజా రీ వెరిఫికేష‌న్ లో పాస్ అయిన‌ట్లుగా పేర్కొన‌టంపై నిప్పులు చెరిగారు. ఇంట‌ర్ బోర్డే త‌న సోద‌రి మ‌ర‌ణానికి కార‌ణంగా ఆమె మండిప‌డ్డారు.

విద్యార్థుల్ని త‌న నిర్ల‌క్ష్యంతో చంపేసిన ఇంట‌ర్ బోర్డు అధికారుల‌పై క్రిమిన‌ల్ కేసు న‌మోదు చేయాలంటూ నిల‌దీశారు. ఫెయిల్ అయ్యామ‌న్న బాధ‌తో మ‌ర‌ణించిన విద్యార్థి పాస్ అయిన‌ట్లుగా తేల‌టంతో ఇంట‌ర్ బోర్డు డిఫెన్స్ లో ప‌డింది. అదే స‌మ‌యంలో ఈ విష‌యం మీడియాలో పెద్ద ఎత్తున ఫోక‌స్ కావ‌టం.. ఇంట‌ర్ బోర్డు రీవెరిఫికేష‌న్ లో 1139 మంది విద్యార్థులు పాస్ అయిన‌ట్లుగా తేల‌టంపైన ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

రీవెరిఫికేష‌న్ లో సున్నా నుంచి 90 మార్కులు ఎలా వ‌స్తాయ‌న్న ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అదే స‌మ‌యంలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌న్నీ ప్ర‌భుత్వ హ‌త్య‌లేన‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఈ విమ‌ర్శ‌ల తీవ్ర‌త నేప‌థ్యంలో గ‌ట్టిగా లెంప‌లేసుకోవాల్సిన తెలంగాణ ఇంట‌ర్ బోర్డు ఊహించ‌ని త‌ప్పు మ‌రొక‌టి చేసింది. అనామిక మార్కుల లిస్ట్ శ‌నివారం సాయంత్రం ఆరు గంట‌ల వ‌ర‌కూ 48 మార్కులున్న తెలుగు స‌బ్జెక్ట్‌.. ఆరు త‌ర్వాత మ‌ళ్లీ య‌థావిధిగా ఫెయిల్ అయిన‌ట్లు చూపించే 21 మార్కుల‌ను ఉంచుతూ ఫ‌లితాన్ని మార్చేశారు.

బోర్డు నిర్ల‌క్ష్యంతో విద్యార్థి మ‌ర‌ణించిన‌ట్లుగా తేలటం.. వెల్లువెత్తుతున్న నిర‌స‌న‌ను న్యూట్ర‌లైజ్ చేసేందుకు దిద్దుకోలేని దారుణానికి పాల్ప‌డింది ఇంట‌ర్ బోర్డు. త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తున్న ఇంట‌ర్ బోర్డు తీరుకు అనామిక ఎపిసోడ్ ప‌రాకాష్ఠ అన్న భావ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది.
Tags:    

Similar News