తెలంగాణలో మూడు వేలు దాటిన కేసులు, ఏడుగురి మృతి

Update: 2020-06-03 17:13 GMT
మ‌హ‌మ్మారి వైర‌స్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో పాజిటివ్ కేసులు మూడు వేలు దాటాయి. వైద్యారోగ్య శాఖ బుధ‌వారం విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్‌లో మొత్తం 129 పాజిటివ్ కేసులు నమోద‌య్యాయ‌ని వెల్ల‌డించింది. వీటి 127 కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా మిగ‌తా 2 కేసులు వలస కార్మికులవి. వీటితో క‌లిపిరాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,020కి చేరుకుంది. రాష్ట్రానికి చెందిన కేసులు మాత్రం 2,572. బుధవారం ఒక్క‌రోజే ఆ వైర‌స్‌తో ఏడుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు వైర‌స్ బారిన ప‌డిన మృతి చెందిన వారి సంఖ్య 99కి చేరుకుంది.

తాజా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 108 కేసులు న‌మోద‌వ‌గా, రంగారెడ్డి జిల్లాలో 6, ఆసిఫాబాద్‌లో 6, మేడ్చల్‌, సిరిసిల్లలో 2 కేసుల చొప్పున, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక‌టి చొప్పున కేసులు న‌మోద‌య్యాయి. ఈ వైర‌స్ బారిన ప‌డిన వారిలో కోలుకున్న వారు రాష్ట్రంలో 1,556 మంది ఉన్నారు. ప్ర‌స్తుతం తాజాగా యాక్టివ్‌గా ఉన్న‌ కేసులు రాష్ట్రంలో 1,365 ఉన్నాయి.

కొద్దిరోజుల్లో హైద‌రాబాద్‌లో ప్ర‌జా ర‌వాణా కూడా ప్రారంభం కానుంది. ఆర్టీసీ, మెట్రో సేవ‌లు ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. వైర‌స్ ఇంత తీవ్రంగా ఉన్న ప‌రిస్థితిలో వాటి నిర్వ‌హ‌ణ‌.. సేవ‌లు ఎలా ఉంటాయోన‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.
Tags:    

Similar News