సింగిల్ లైన్ కే కాంగ్రెస్ ను పరిమితం చేసిన కేసీఆర్?

Update: 2022-08-21 05:06 GMT
కోపం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు ఎంత తీవ్రంగా.. మరెంత పదునుగా ఉంటాయో తెలిసిందే. అలాంటి ఆయన తాజాగా ఎదురైన మునుగోడు అగ్నిపరీక్ష వేళ.. కమలనాథుల మీద కస్సుమంటున్నారు. ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఫైనల్ ఎగ్జామ్ కోసం ఎంచక్కా ప్లానింగ్ చేసుకుంటున్న వేళ.. అనుకోని రీతిలో ప్రీఫైనల్ ఎగ్జామ్ ఫలితం ఆధారంగా ఫైనల్ మార్కులు లెక్క వేస్తామంటే విద్యార్థులకు ఎంత మంట పుడుతుందో.. అలాంటి మంటే ఇప్పుడు బీజేపీ తీరుపై గులాబీ బాస్ కు ఉందని చెప్పాలి.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో (ఎన్నికల సంఘం ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు. అందుకు మరికొన్ని నెలల సమయం పట్టొచ్చు) ఏర్పాటు చేసిన సభలో ఆయన బీజేపీ మీదా.. కేంద్రంలోని మోడీ సర్కారుపైనా ఎంతలా విరుచుకుపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ప్రథమ శత్రువు బీజేపీ అన్న విషయాన్ని తన ప్రసంగంతో స్పష్టం చేశారు. మునుగోడులో ఇప్పటివరకు బీజేపీకి డిపాజిట్ రాలేదని.. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందన్న ఆయన మాటలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పాలి.

నిజంగానే బీజేపీకి డిపాజిట్ రాని పరిస్థితే ఉంటే.. అసలు ఇంతటి సభను ఏర్పాటు చేయటం.. ఇన్నేసి మాటలు అనాల్సిన అవసరం ఉండదు కదా? నిజానికి మునుగోడు కాంగ్రెస్ పార్టీ సీటు. కానీ.. బీజేపీ బలపడిన పరిస్థితి.. కాంగ్రెస్ నుంచి రాజగోపాల్ రెడ్డి కమలం పార్టీలోకి వెళ్లటంతో.. ఆ పార్టీకి ఇప్పుడు విజయం అనివార్యమైంది. అందుకే.. ఆయన తన టార్గెట్ మొత్తంబీజేపీ మీదనే తప్పించి.. కాంగ్రెస్ పైన పెద్దగా మాట్లాడింది లేదు.

మునుగోడు సభను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆయన సింగిల్ లైన్ కామెంట్ చేయటమే తప్పించి ఘాటు విమర్శలు చేసింది లేదు. తనను ఉద్దేశించి తరచూ విరుచుకుపడే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఎలాంటి కామెంట్లు చేయకపోవటం గమనార్హం.కాంగ్రెస్ పార్టీ తమకు ఎలాంటి పోటీనే కాదన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందని చెప్పాలి. నిజానికి ఆయన ప్రసంగాన్ని చూస్తే.. ఆ పార్టీని ఆయన ఇగ్మోర్ చేసినట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా తన ప్రచారాన్ని.. ప్రసంగాన్ని ఇట్టే మార్చుకునే టాలెంట్ ఉన్న కేసీఆర్.. కాంగ్రెస్ ను సింగిల్ లైన్ కే పరిమితం చేశారంటే.. దాని లెక్కలు దానికి ఉన్నట్లుగానే చెప్పక తప్పదు.
Tags:    

Similar News