మోడీకి కేసీఆర్ షాకివ్వ‌నున్నారా?

Update: 2018-06-15 06:06 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ మ‌ధ్య‌న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని క‌లుసుకునేందుకు ఢిల్లీకి రావ‌టం.. ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లించిన‌ట్లే ఫ‌లించి.. అంత‌లోనే వెన‌క్కి పోవ‌టంతో మ‌రికొద్ది గంట‌ల్లో మోడీని మా సీఎం క‌లుస్తున్నారంటూ చెప్పిన టీఆర్ఎస్ నేత‌లు నాలుక కొరుక్కున్నారు. మోడీతో భేటీకి టైం ఇవ్వ‌క‌పోవ‌టంతో వెన‌క్కి వ‌చ్చేసిన కేసీఆర్‌.. తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌టం తెలిసిందే.

ఈసారి మోడీతో భేటీకి అవ‌స‌ర‌మైన ఫార్మాలిటీస్ పూర్తి చేయ‌టంతో పాటు.. భేటీ క‌న్ఫ‌ర్మ్ అయ్యాక‌నే కేసీఆర్ ఢిల్లీకి బ‌య‌లుదేరిన‌ట్లుగా చెబుతున్నారు. మోడీతో భేటీకి సంబంధించి బ‌య‌ట‌కు చెబుతున్న కార‌ణాల‌కు.. లోగుట్టుగా న‌డుస్తున్న ప్ర‌చారానికి పొంత లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర‌.. కొత్త జోన‌ల్ విధానం.. ముస్లిం.. ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల పెంపు.. హైకోర్టు విభ‌జ‌న‌.. ఢిల్లీలోని ఏపీ భ‌న‌వ్ ను తెలంగాణ‌కు కేటాయింపు లాంటి మొత్తం 68 అంశాల్ని మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకే మోడీతో భేటీ అవుతున్న‌ట్లుగా అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇందుకు భిన్నంగా వినిపిస్తున్న అంశాల్ని ప్రాతిప‌దిక‌గా తీసుకుంటే.. ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌లు.. జేడీఎస్ కు తాను మ‌ద్ద‌తు ప‌లికిన వైనంతో పాటు.. భ‌విష్య‌త్తులో అనుస‌రించాల్సిన వ్యూహంపైనా తుది చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇటీవ‌ల కాలంలో తాను ప్ర‌స్తావిస్తున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్లానింగ్ పైనా మోడీతో కేసీఆర్ చ‌ర్చ‌లు ఉంటాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. తాను ప్ర‌స్తావించే అంశాల‌కు సంబంధించి క‌నీసం రెండు.. మూడు ముఖ్య‌మైన అంశాల‌కు సంబంధించిన హామీలు ఇస్తే స‌రి అని.. లేని ప‌క్షంలో మోడీ తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేసేందుకు కేసీఆర్ రెండో వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.  

మోడీతో జ‌రిగే మీటింగ్ ఆధారంగానే కేసీఆర్ త‌ర్వాత ప్లానింగ్ ఉంటుంద‌న్న మాట వినిపిస్తోంది. మోడీతో సానుకూలంగా చ‌ర్చ‌లు జ‌రిగితే.. ఈ నెల 17న అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో నిర్వ‌హిస్తున్న నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొంటార‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అందుకు భిన్నంగా జ‌రిగితే మాత్రం మోడీతో భేటీ అయిన వెంట‌నే హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేస్తార‌ని.. ముఖ్య‌మంత్రుల భేటీకి డుమ్మా కొడ‌తారంటున్నారు. తాను ప్ర‌స్తావిస్తున్న అంశాల‌పై మోడీ సానుకూలంగా లేనిప‌క్షంలో.. ఆయ‌న నేతృత్వంలో నిర్వ‌హించే స‌మావేశానికి డుమ్మా కొట్టాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లుగా ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.
Tags:    

Similar News