సవాళ్ల సామ్రాట్ కేసీఆర్ కే సవాళ్లా..? ఈటల.. రాజగోపాలా?

Update: 2022-07-31 13:30 GMT
కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేస్తా.. ఆయనను ఓడిస్తానంటూ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కొన్ని రోజులుగా అంటున్నారు. కేసీఆర్ కు ఒకప్పుడు ఈటల అత్యంత సన్నిహితులు కావడం, ఉద్యమ సమయంలో, టీఆర్ఎస్ లో పోషించిన పాత్ర రీత్యా తొలుత ఆయన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. ఇక కేసీఆర్.. దమ్ముంటే మునుగోడులో పోటీ చేయ్ అంటూ తాజాగా కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. రాజకీయంగా వార్తల్లో నిలిచేందుకు ఈ సవాల్ సరే కానీ.. క్షేత్ర స్థాయిలో చూస్తే మాత్రం డొల్లగా
కనిపిస్తోంది. టీఆర్ఎస్ అధినేతగా, ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా, రెండుసార్లు సీఎంగా ఉన్న కేసీఆర్ స్థాయికి వీరిద్దరూ తగరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

హుజూరాబాద్ ఈటల అడ్డానే అయినా..?

కేసీఆర్ ను పోటీ చేయమంటూ సవాల్ చేస్తున్న ఈ ఇద్దరి నియోజకవర్గాల విషయానికికొద్దాం.. ఈటల నియోజకవర్గం హుజూరాబాద్ లో ఆయనకు గట్టి పట్టున్న మాట వాస్తవం. అందుకనే దళిత బంధు వంటి భారీ పథకాన్ని ప్రకటించి ఎంతగా ప్రయత్నించినా ఉప ఎన్నికలో ఆయన గెలుపు ఆపలేకపోయారు. దాదాపు 25 వేల ఓట్లతో ఈటల గెలుపొందారు. అయితే, రాజేందర్ బీజేపీ తరఫున పోటీ చేయడంతో ఈ మాత్రం మెజార్టీ సాధించగలిగారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఉంటే ఓటమికే అవకాశాలు ఎక్కుగా ఉండేవి. అప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈటలను
ఆర్థికంగా కట్టడి చేయాలని చూసింది. వీలైతే మరింతగా ఇబ్బంది పెట్టేదేమో? కానీ, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఈటలను పెద్దగా ఏమీ చేయలేకపోయింది. మరోవైపు వ్యక్తిగత బలానికి తోడు హుజూరాబాద్ లో తగినంతగా బీజేపీ కార్యకర్తల బలం సమకూరింది. ఈ నేపథ్యంలోనే ఈటల విజయం సాధ్యమైంది. అయితే, ఇదంతా అవతలి అభ్యర్థి స్థాయిని బట్టి కూడా ఉంటుంది. ఈటలపై పోటీచేసిన గెల్లు శ్రీనివాస్ ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త. ఇక కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన మాజీ క్రికెటర్ కౌశిక్ రెడ్డి తన స్థాయిలో ఓట్లు మళ్లించగలిగినా అవి
ఈటల గెలుపు నిరోధించేంతగా మాత్రం లేవు. కాగా, ఇక టీఆర్ఎస్ నుంచి కేసీఆరే అభ్యర్థిగా నిలిస్తే ఇదంతా ఏమీ సాగదు. ఒక్కసారిగా పరిణామాలు మారిపోవడం ఖాయం.

రాజగోపాలా..? పార్టీ మారకముందే సవాలేల?

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీని వదలి బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. వెళ్లడం ఖాయమే అయినా.. అది ఎలా? ఎప్పుడు? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనిపై ఆయన అనేక రకాల మెలికలు పెడుతున్నారు. వాస్తవానికి బీజేపీని చూపించి కాంగ్రెస్ ను ఇన్నాళ్లూ బెదిరించిన రాజగోపాల్ రెడ్డి ఇకపై మాత్రం తాడోపేడో తేల్చుకునే ఉద్దేశంలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యలనే పేరున్నా.. ఆయన మాత్రం పొసగలేకపోయారు. మరీ ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి
నియామకం తర్వాత రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీలో ఇమడలేకపోయారు. తన అన్న, నల్లగొండ ఎంపీ వెంకటరెడ్డి సర్దుకుపోయినా.. రాజగోపాల్ రెడ్డి ససేమిరా అంటున్నారు. అయితే, కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి సైతం కేసీఆర్ ను మునుగోడులో పోటీ చేయమంటూ సవాల్ చేస్తున్నారు. పార్టీ మారకముందే.. ఉప ఎన్నిక రాకముందే.. అసలింకా ఏమీ తేలకముందే రాజగోపాల్ రెడ్డి సవాళ్ల స్థాయికి వెళ్లిపోయారు.

కేసీఆర్ కాలుపెడితే ఎలా ఉంటుందో.. గజ్వేల్ ను అడుగు గజ్వేల్.. 2009 వరకు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. దాదాపు 20 ఏళ్లు మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. 2009లో నియోజకవర్గం జనరల్ అయింది. 2014లో తెలంగాణ వచ్చాక కేసీఆర్ నేరుగా ఇక్కడినుంచే బరిలో దిగారు. వాస్తవానికి గజ్వేల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాపరెడ్డి టీడీపీ తరఫున బలమైన నాయకుడు. గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేసిన ఆయన 2014లో గెలవడం ఖాయమని భావించారు. ఇంతలో తెలంగాణ రావడం, కేసీఆరే బరిలో నిలవడంతో ప్రతాపరెడ్డికి ఓటమి ఎదురైంది. అప్పటికీ.. కేసీఆర్ సాధించిన మెజార్టీ 20 వేల లోపే. తెలంగాణ సాధించిన ఊపులోనూ ఆయనకు దక్కిన మెజార్టీ ఇదని మర్చిపోకూడదు. ఇక 2018 నాటికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం హోదాలో కేసీఆర్ గజ్వేల్ రూపురేఖలే మార్చేశారు. దీంతో సునాయాస విజయం సాధించారు. 2014కు ముందు, 2014 తర్వాత గజ్వేల్ కు అసలు పోలికే లేదు. దీన్నిబట్టి తేలేదేంమంటే.. కేసీఆర్ కు సవాల్ చేయడం కాదు. ఆయన నేరుగా బరిలో దిగితే ఎలా ఉంటుందనేది గజ్వేల్ ఉదాహరణను బట్టి తెలుస్తుంది.

కేసీఆర్ కే సవాళ్లా?

కేసీఆర్ కు సవాళ్లు కొత్తేం కాదు. కాంగ్రెస్ సీనియర్లు దివంగత కాకా, నాటి పీసీసీ చీఫ్ కేకే తదితరులు విసిరిన సవాళ్లను పునాదిగా చేసుకుని 2006లో కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్ రాజీనామా చేశారు. నాటి ఉప ఎన్నికలో గెలిచి తెలంగాణ వాదానికి ప్రాణం పోశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హవా కొనసాగిన కాలంలో.. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయడం కూడా ఎంతో సవాల్ తో కూడుకున్నదే. తక్కువ మెజార్టీతో బయటపడినా.. కేసీఆర్ సత్తా ఏమిటో అక్కడ తెలిసింది. కాబట్టి. కేసీఆర్ లాంటి నాయకుడికి సవాల్ విసరాలంటే.. ఆయన కంటే అనేక రెట్లు పెద్దవారైతేనే సాధ్యమని గుర్తించాలి.
Tags:    

Similar News