గిరిజనులకు కేసీయార్ ‘రిజర్వేషన్’ ఎరేస్తున్నారా ?

Update: 2022-09-18 09:30 GMT
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించబోతున్నట్లు కేసీయార్ ప్రకటించారు. అలాగే భూమిలేని గిరిజనులకు తలా రు. 10 లక్షల సాయం అందించాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసిందన్నారు. పదిశాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారంరోజుల్లో ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు ప్రకటించారు. కేసీయార్ తాజా ప్రకటన చూసిన తర్వాత మునుగోడు ఉపఎన్నికలో  వాళ్ళ ఓట్లకోసమే గాలమేసినట్లు అనుమానంగా ఉంది.

ఉమ్మడి ఏపీలో గిరిజనులకు 5 శాతం రిజర్వేషన్ ఉందట. అలాంటిది రాష్ట్రం విడిపోయిన ఏడాది తర్వాత గిరిజనుల రిజర్వేషన్ను 10 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చెప్పారు. అయితే కేంద్రం ఆ తీర్మానాన్ని సంవత్సరాలుగా తొక్కిపెట్టినట్లు మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ తీర్మానానికి  రాష్ట్రపతి ఆమోదం వచ్చేట్లు చేయాలని నరేంద్రమోడీని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఇక్కడే కేసీయార్ ప్రకటనపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ ఆ అనుమానాలు ఏమిటంటే కేంద్రం ఆమోదంలేకుండా రిజర్వేషన్లను కేసీయార్ తనంతట తానుగా సవరించలేరన్నది వాస్తవం. గడచిన ఏడేళ్ళుగా కేంద్రందగ్గర అసెంబ్లీ తీర్మానం పెండింగ్ లోనే ఉందని కేసీయార్ చెప్పటమే దీనికి నిదర్శనం. మరి కేంద్రం ఆమోదం పొందకుండా రాష్ట్రపతి సంతకం లేకుండా కేసీయార్ రిజర్వేషన్లను పెంచలేరు, పెంచినా చెల్లదు. ఎందుకంటే రిజర్వేషన్లన్నది రాష్ట్రాల పరిధిలో లేని అంశం. తన పరిధిలోని అంశంపై కేసీయార్ ఎలాగ నిర్ణయం తీసుకుంటారు ?

వారంరోజుల్లో రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి జీవో జారీ అవుతుందన్నారు. ఒకవైపేమో ఏడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న తీర్మానానికి మోక్షం కల్పించమని అడుగుతునే మరోవైపు వారం రోజుల్లో 10 శాతానికి రిజర్వేషన్లు పెంచుతు జీవో ఇస్తామని చెబితే ఎవరైనా ఎలా నమ్ముతారు. అంటే కేసీయార్ ప్రకటనలో రెండు కారణాలున్నట్లు అనుమానంగా ఉంది. మొదటిది మునుగోడు ఉపఎన్నికలో లబ్దిపొందటం. రెండో కారణం రాబోయే ఎన్నికల్లో గిరిజనుల ముందు బీజేపీని బూచిగా చూపించటం. మరి కేసీయార్ ప్లాన్ వర్కవుటవుతుందా ?
Tags:    

Similar News