ఇదీ...'ఉత్తమ' రాజకీయం

Update: 2018-11-10 05:00 GMT
కాంగ్రెస్ పార్టీ. విలక్షణమైన పార్టీ. విశేష గుణాలున్న పార్టీ. అధికారం కోసం ప్రతిపక్ష పార్టీలను ఓడించేందుకు వ్యూహరచనలు చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్న పార్టీ. అంతే కాదు... తమ అధికారం కోసం సొంత పార్టీ నేతలని కూడా దెబ్బ కొట్టేందుకు వెనుకాడని పార్టీ. దీనికి ఆనాటి నెహ్రు నుంచి ఈనాటి నాయకుల వరకూ ఎవరూ మినహాయింపు కాదు. అధిష్టానం అండదండలతో కాంగ్రెస్ పార్టీలో ప్రతి నాయకుడు అత్యున్నత పదవికి పోటిలో ఉంటారు. దీంతో పార్టీలోనే ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటారు. ప్రస్తుతం ముందస్తు ఎన్నికలు జరుగుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యూహ రచనే జరుగుతోందంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్దిత్వం కోసం పోటి పడుతున్న నాయకులు తమ వ్యూహాలను పదును పెట్టి ఈ పదవికి పోటి పడే వారికి టిక్కెట్టు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం ఇదే "ఉత్తమ" మైన మార్గమని ఆ నాయకులు భావిస్తున్నట్లు ప్రచారం. ఈ వ్యూహంలో భాగంగా మహాకూటమి ఏర్పాటును బూచిగా చూపించి పలువురికి టిక్కెట్టు రాకుండా అడ్డుపడుతున్నట్లు సమాచారం.

"మనకి తెలంగాణ రాష్ట్ర సమితి గద్దె దిగడం ముఖ్యం. ఇందుకోసం అందరూ త్యాగాలు చేయడానికి సిద్దపడండి" అని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను ఈ నాయకులు తమకు అనుకూలంగా వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేణుకా చౌదరి - జానా  రెడ్డి వంటి సీనియర్ నాయకుల నోటి వెంట  " మేము త్యాగాలకు సిద్దం " అనే మాట వచ్చింది. దీనిని "ఉత్తమ" మైన రాజకీయంగా గాంధీ భవన్‌ లో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే పొన్నాల లక్ష్మయ్య వంటి సీనియర్ నాయకులకు వారి నియోజక వర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి సీటు వచ్చేల చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం మహాకూటమిలో భాగస్వామ్య పార్టీ అయిన తెలంగాణ జన సమితికి పొన్నాల నియోజకవర్గం జనగామను కట్ట బెడుతున్నారని అంటున్నారు. బిసీ కులాలకు చెందిన వారే ముఖ్యమంత్రి కావాలని ఆ వర్గీయులు ప్రచారం చేస్తున్న సందర్భంలో బిసీ కులానికి చెందిన పొన్నాలను సీఎం రేసులో లేకుండా చేయలన్నది తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల వ్యూహంగా చెబుతున్నారు.


Tags:    

Similar News