తెలంగాణలో ఆన్ లైన్ రమ్మీ ఆడితే ఇక జైలే

Update: 2017-06-18 07:58 GMT
సోషల్ మీడియా - వెబ్ సైట్లలో ఎక్కడ చూసినా ఆన్ లైన్ గేమ్స్ ప్రకటనలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ రమ్మీ అంటూ అందరినీ ఆకర్షించే ప్రయత్నం ఒకటి చాలాకాలంగా జరుగుతోంది. అది ఆడితే ఉద్యోగం సద్యోగం అవసరం లేకుండానే హాయిగా ఆడుతూ లక్షలు సంపాదించేయొచ్చంటూ ప్రకటనలు వస్తుంటే చాలామంది ఆ మాయలో పడుతున్నారు. లక్షలు సంపాదించడం మాటెలా ఉన్నా లక్షలు పోగొట్టుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్ ను నిషేధించింది.
    
సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.  దీంతో పాటు నాలుగు ఆర్డినెన్సులకు ఆమోదం తెలిపింది. పోలీస్ శాఖలో 26,290 పోస్టులు మూడేళ్లలో దశల వారీగా భర్తీ చేయాలని నిర్ణయించింది. వీటిలో 18,290 ఉద్యోగాలు కొత్తవి కాగా.. మిగిలినవి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. ఇవిగాక, రెవిన్యూ శాఖలో 2,506 ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు.
    
ఈ మంత్రివర్గ సమావేశం మూడు గంటలకు పైగా సాగింది. విత్తనాలు, ఆహార పదార్థాలు కల్తీ చేయడం, అటవీ భూముల ఆక్రమణ, సైబర్, వైట్ కాలర్ నేరాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కలిగి ఉండటం వంటి 10 అంశాలను పీడీ యాక్ట్ లో చేరుస్తూ ఆర్డినెన్స్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆన్ లైన్ గేమింగ్, పేకాట, గ్యాంబ్లింగ్ పై నిషేధం విధిస్తూ ఆర్డినెన్స్ ను కేబినెట్ ఆమోదించింది.  దీనికి భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News