తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు - పెన్షనర్లకు గుడ్ న్యూస్

Update: 2020-06-24 07:02 GMT
లాక్‌డౌన్ ప్రభావంతో ఆదాయం కోల్పోయిన నేపథ్యంలో   తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్, మే నెలల్లో కోత విధించారు. దీనిపై ఉద్యోగులు, పింఛన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈనెల జీతమైనా కోత లేకుండా చెల్లించాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేయడంతో ప్రస్తుతం ప్రభుత్వానికి ఆదాయం రాక మొదలైంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్ దారులకు జూన్ నెలకు సంబంధించి పూర్తి జీతం.. పూర్తి పింఛన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు.. పింఛన్ పొందే వారు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ విషయమై మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ను కలిసి విన్నవించుకున్నారు. జూన్ నెల నుంచైనా పూర్తి వేతం ఇవ్వాలని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక సభ్యులు తదితరులు కలిశారు. జీతాల్లో కోతలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. జూన్ నెల వేతనం లో ఎలాంటి కోతలు లేకుండా పూర్తి శాలరీ చెల్లించాలని కోరారు. వాళ్లు ఉదయం కోరగా సాయంత్రం ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

తెలంగాణలో లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల్లో 75 శాతం కోత, మేయర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల జీతాల్లో కోతపెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగాలు చేస్తున్న వారి జీతాల్లో 60 శాతం కోత విధించింది. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 50 శాతం కోత పెట్టింది. నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 10 శాతం కోత విధించింది. రిటైర్డ్ ఉద్యోగులకు అందించే పెన్షన్లలో 50 శాతం కోత పెట్టిన సర్కారు.. నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారికి పూర్తి చెల్లింపులు చేయనున్నారు.
Tags:    

Similar News