సమ్మె కేసీఆర్ స్వయంకృతమే... హైకోర్టు తేల్చేసింది

Update: 2019-10-18 13:28 GMT
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె... సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంకృతమేనని రాష్ట్ర హైకోర్టు తేల్చి పారేసింది. ప్రభుత్వ నిష్క్రియాపరత్వం కారణంగానే కార్మికులు సమ్మెకు వెళ్లారని, అయినా సమ్మెకు వెళ్లేలా కార్మికులను ముందుకు తోసింది ప్రభుత్వ నిర్ణయాలేనన్న కోణంలో హైకోర్టు చేసిన కామెంట్లు కేసీఆర్ కు నిజంగానే పెద్ద దెబ్బగానే పరిగణించక తప్పదు. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు... కేసీఆర్ సర్కారు తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె నోటీసు ఇస్తే... కనీసం వారితో చర్చలు కూడా ఎందుకు జరపలేకపోయారని ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసిన తీరు చూస్తుంటే... ఈ సమ్మె కేసీఆర్ గ్రాఫ్ ను అమాంతంగా కింద పడేసిందని చెప్పక తప్పదు.

విచారణ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్టీసీ ఎండీ నియామకం ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు కాస్తంత గట్టిగానే ప్రశ్నించింది. ఎండీ నియామకం చేపట్టి ఉంటే కార్మికులకు కాసింత నమ్మకం కలిగి ఉండేదని న్యాయస్థానం అభిప్రాయపడింది.  ప్రస్తుతం ఆర్టీసీ ఇంచార్జ్‌గా సీనియర్‌ అధికారి ఉన్నారని ప్రభుత్వం తెలుపడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పుడున్న అధికారి సమర్థుడైతే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రజలు శక్తివంతులని, వాళ్లు తిరగబడితే.. ఎవరు ఆపలేరని కోర్టు సంచలన వ్యాఖ్య చేసింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం వాటిని ఎందుకు ఆపలేదని ప్రశ్నించిన న్యాయస్థానం.. కార్మిక సంఘాలతో చర్చలు ఎందుకు జరపలేదని ప్రశ్నించింది. రేపు(శనివారం) ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన రాష్ట్ర బంద్‌పై ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని కోరింది. కార్మికులు శాంతియుతంగా బంద్‌ చేపడితే అభ్యంతరం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

ఇక సమ్మె ముగింపు దిశగా తక్షణ చర్యలు చేపట్టాల్సిందేనన్న హైకోర్టు... సమ్మె చేపట్టిన కార్మికులతో చర్చలు జరపాలని ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. శనివారం ఉదయం 10.30 గంటలకు రెండు యూనియన్లను చర్చలకు పిలవాలని ఆర్టీసీకి తెలిపింది. అలాగే మూడు రోజుల్లో చర్చలు పూర్తిచేయాలని పేర్కొంది. కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడాలని అభిప్రాయపడింది.  అలాగే చర్చల వివరాలను ఈ 28న కోర్టుకు తెలపాలని ఆదేశాలు జారీచేసింది. అంతకు ముందు వాదనల సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఓ వైపు ప్రశ్నల వర్షం కురిపిస్తూనే... మరోవైపు సమ్మెకు ముగింపు పలికేలా కేసీఆర్ సర్కారు తక్షణ చర్యలు చేపట్టాల్సిందేనని హైకోర్టు ఆదేశించిన తీరు చూస్తుంటే... కార్మిక సంఘాలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న కేసీఆర్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలిందన్న వాదన వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే... విచారణ సందర్భంగా ప్రభుత్వం వినిపించిన వాదన తేలిపోయిందన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ వాదన ఎలా సాగిందంటే... ‘ప్రస్తుతం ఆర్టీసీ పీకల్లోతు అప్పుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు 67 శాతం జీతాలు పెరిగాయి. ప్రభుత్వం నిధులు 600 శాతం పెరిగాయి. కార్మికులతో చర్చలు జరపడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేశాం. చర్చలు జరుగుతుండగానే కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్లాయి. వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించింది. ఆర్టీసీని కోలుకోలేని దెబ్బతీసిన సంఘాలు.. సంస్కరణకు అడుగడుగునా అడ్డుతగులుతున్నాయి’అని ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ నివేదికను చూసినంతనే హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ తీరుపై ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేస్తూ... సమ్మెకు కారణం ప్రభుత్వ తీరేనన్న రీతిలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Tags:    

Similar News