తెలంగాణ హైకోర్టు ప్ర‌శ్న‌.. ఏపీ స‌ర్కారులో అల‌జ‌డి! ఏం జ‌రిగిందంటే!

Update: 2021-08-18 17:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టులు.. చాలా యాక్టివ్ గా ప‌నిచేస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌భుత్వాల వైఖ‌రిపై కోర్టులు ప్ర‌శ్న‌లు సంధించ‌డంతోపాటు.. నిల‌దీత‌లు కూడా చేస్తున్నాయి. అయితే.. తాజాగా త‌న‌కు సంబంధం లేని ఒక విష‌యంపై తెలంగాణ హైకోర్టులో.. జ‌రిగిన విచార‌ణ‌ను ఏపీ స‌ర్కారు నిశితంగా గ‌మ‌నించింది. అక్క‌డి కేసీఆర్ ప్ర‌భుత్వానికి తెలంగాణ హైకోర్టు సంధించిన ప్ర‌శ్న‌ల‌తో.. ఇక్క‌డ ఏపీ స‌ర్కారు ఉలిక్కిప‌డింది. ఇక్క‌డ కూడా మ‌న‌కు ఇలాంటి ప‌రిణామ‌మే ఎదురైతే.. అనే దిశ‌గా అప్పుడే ఆలోచ‌న ప్రారంభించింది. దీంతో ఈ విష‌యం ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో ప్ర‌ధానంగా చ‌ర్చకు వ‌చ్చింది.

ప‌థ‌కంపై గోప్యత‌!

తెలంగాణలోని కేసీఆర్ స‌ర్కారుకు ఇటీవ‌ల కాలంలో రాష్ట్ర హైకోర్టు నుంచి ప్ర‌శ్న‌ల తూటాలు ఎదుర‌వుతున్నారు. కొన్నాళ్ల కింద‌ట క‌రోనా విష‌యంలో హైకోర్టు తీవ్ర‌స్థాయిలో స్పందించింది. మ‌ర‌ణాలు దాస్తున్నారంటూ.. నిల‌దీసింది. ఇక‌, భూభార‌తి విష‌యంలోనూ.. కోర్టు తీవ్రంగానే రియాక్ట్ అయింది. ఇక‌, ఇప్పుడు తాజాగా.. ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి కూడా హైకోర్టు సీరియ‌స్ అయింది. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ తాను ద‌త్త‌త తీసుకున్న‌ వాసాలమర్రి గ్రామంలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో తాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ దళితబంధు  ప‌థాకాన్ని ఇక్క‌డ అమ‌లు చేశారు.

హైకోర్టులో పిటిష‌న్లు..

అయితే.. ఈ ప‌థ‌కం అమలుపై హైకోర్టులో  పిటిష‌న్లు దాఖ‌ల‌య్యాయి. దీనికి సంబంధించిన విదివిధానాల‌ను ప్ర‌భుత్వం పొందు ప‌ర‌చ‌కుండా.. క‌నీసం ఈ జీవోల‌ను ప‌బ్లిక్ డొమైన్‌(సైట్‌)లో పెట్ట‌కుండా దోబూచు లాడుతోంద‌ని పిటిష‌న్లు ప‌డ్డాయి. వీటిపై బుధ‌వారం హైకోర్టు విచారణ చేప‌ట్టింది.   ఈ పిటిష‌న్‌పై చీఫ్ జ‌స్టిస్ హిమాకోహ్లి, జ‌స్టిస్ విజ‌య‌సేన్‌రెడ్డి ధ‌ర్మాస‌నం స్పందించింది.  నిబంధ‌న‌లేవీ ఖ‌రారు చేయ‌కుండానే ద‌ళిత బంధుకు నిధులు విడుద‌ల చేయ‌డంపై పిటిష‌న్ వేసిన వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ ధ‌ర్మాస‌నం దృష్టికి తీసుకెళ్లింది.

ప్ర‌భుత్వ వాద‌న ఇదీ.

అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ప్రసాద్‌ స్పందిస్తూ.. రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ పథకం వర్తిస్తుందన్నారు. ఆ మేర‌కు ప్ర‌భుత్వం నిబంధనలు ఖరారు చేసినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటూ పిటిషన్‌లో ఆ నిబంధనలను ఎందుకు జత చేయలేదని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది శశికిరణ్‌ స్పందిస్తూ.. పథక నిబంధనల జీవో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ధ‌ర్మాస‌నం స్పందిస్తూ...  అస‌లు జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏంటని నిల‌దీసింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని కేసీఆర్ స‌ర్కార్‌ను హైకోర్టు ఆదేశించింది. అంతేకాదు, జీవో ఇచ్చిన 24 గంటల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.  

ఏపీలో ప్ర‌కంప‌న‌లు..

అయితే.. తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌తో ఏపీ ప్ర‌భుత్వంలో ప్ర‌కంప‌న‌లు చెల‌రేగాయి. ఎందుకంటే.. ఇటీవ‌ల కొన్ని జీవోల‌ను ప‌బ్లిక్ డొమైన్‌లో పెట్ట‌కుండా.. ర‌హ‌స్యంగా ఉంచుతున్నారు. దీనికి స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ ఆదేశాలు ఉన్న‌ట్టు తెలిసింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆదేశాల‌పై ఏపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే రీతిలో ఏపీ ప్ర‌భుత్వానికి న్యాయ‌స్థానంలో మొట్టికాయ‌లు త‌ప్ప‌వ‌నే అభిప్రాయాలు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే గోప్య‌త‌ను న్యాయ‌స్థానం ఎప్ప‌టికీ స‌హించ‌ద‌ని, ముఖ్యంగా ప్ర‌జ‌ల‌కు సంబంధించిన జీవోల‌పై దాప‌రికం ఎందుక‌ని అంటున్నారు.  ఇక‌, ఇదే విష‌యంపై ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కొన్నాళ్లుగా ప్ర‌భుత్వానికి ప్ర‌శ్న‌లు సంధిస్తోంది. జ‌గ‌న్ ర‌హ‌స్య జీవోల‌పై టీడీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యంలో రేపు ఏపీలోనూ ఎవ‌రైనా.. హైకోర్టుకు వెళ్తే.. జ‌గ‌న్‌కు ఖ‌చ్చితంగా హెచ్చరిక‌లు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News