టెన్త్ పరీక్షల పై హైకోర్టు కీలక నిర్ణయం ..వారికీ ఇప్పట్లో పరీక్షల్లేవ్..!

Update: 2020-06-06 12:30 GMT
తెలంగాణ లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, రంగారెడ్డి జిల్లాలో మినహా , రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈరోజు రెండుసార్లు విచారణ జరిగింది. ఉదయం జరిగిన వాదన సందర్భంగా ఇప్పుడు నిర్వహించాలనుకుంటున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకాలేకపోయిన వారికి అడ్వాన్స్ సప్లిమెంటరీలో అవకాశం కల్పిస్తామని, అయితే, వారిని కూడా రెగ్యులర్ కిందే పరిగణిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టుకు నివేదించారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే, ప్రస్తుతం జీహెచ్‌ ఎంసీ, రంగారెడ్డి మినహా మిగతా జిల్లాల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు సూచించింది.

దీనిపై ఏజీ అభ్యంతరం తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని తెలిపారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందన్నారు. అయితే, విద్యార్థుల ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. అనంతరం జీహెచ్ ఎం సీ, రంగారెడ్డి జిల్లా మినహా మిగిలిన చోట్ల పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాంతాల్లో విద్యార్థులకుi సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినప్పుడు అవకాశం కల్పించాలని, అలాగే వారిని కూడా రెగ్యులర్ కిందే పరిగణించాలని ఆదేశించింది.
Tags:    

Similar News