అతను చనిపోయాడా? లేదా ?..ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు !

Update: 2020-06-04 13:30 GMT
తన భర్త మధుసూదన్ ఆచూకీ కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన వనస్థలిపురం మహిళకు.. ఆమె భర్త కరోనాతో మృతి చెందగా జీ హెచ్ ఎం సీ సిబ్బందే అంత్యక్రియలు పూర్తిచేశారని తెలిసిన విషయం నగరంలో ఎంత వివాదమైందో తెలిసిందే. వైరస్ బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే , అప్పటినుండి ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆ మహిళ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ మేరకు మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్ ‌పై స్పందించిన న్యాయస్థానం అసలు మధుసూదన్‌ బ్రతికి ఉన్నాడా? లేడా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సమాధానిస్తూ.. కొద్ది రోజుల క్రితమే అతడు కరోనాతో మరణించాడని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో శుక్రవారంలోగా అఫిడవిట్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారం వాయిదా వేసింది.

తెలంగాణలో .. బుధవారం 129 కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. దీనితో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం వైరస్ కేసుల సంఖ్య 3,020కి చేరింది. వీరిలో 448 మంది విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, వలస కార్మికులు ఉన్నారు. వైరస్‌‌ తో పోరాడుతూ తెలంగాణలో ఇప్పటి వరకు 1556 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1365 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News