2014లో తెలంగాణ‌.. 2018లో బాబు.. 2023లో మోడీ.. ఇదే కేసీఆర్ మంత్రం

Update: 2022-02-11 07:34 GMT
తెలంగాణ రాష్ట్ర సాధ‌నే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఏర్ప‌డింది. అప్ప‌టి నుంచి తెలంగాణ సెంటిమెంట్‌తో ఎన్నిక‌ల్లో కేసీఆర్ లాంటి ఆ పార్టీ నాయ‌కులు గెలుస్తూ వ‌చ్చారు. ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక కూడా అదే సెంటిమెంట్‌తో వ‌రుసగా రెండు ఎన్నిక‌ల్లోనూ గెలిచి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చింది.

వ‌చ్చే ఏడాది తెలంగాణ‌లో మూడోసారి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  అప్ప‌టికీ తెలంగాణ ఏర్ప‌డి తొమ్మిదేళ్లు దాటుతుంది. మ‌రోసారి ఆ సెంటిమెంట్‌ను ర‌గిలిస్తే ప్ర‌యోజ‌నం ఉంటుందా? లేదా? అనే అనుమానాలు క‌లిగాయి. కానీ ఇప్పుడు మోడీ వ్యాఖ్య‌ల పుణ్య‌మా అని టీఆర్ఎస్‌కు మ‌రోసారి సెంటిమెంట్ అస్త్రం దొరికింద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అప్ప‌టి నుంచి..

2014లో ప్ర‌త్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్ప‌డింది. ఆ ఏడాది ఎన్నిక‌ల్లో రాష్ట్ర సాధ‌న ఉద్య‌మాన్ని న‌డిపించిన టీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. అధికారం క‌ట్ట‌బెట్టారు. దీంతో తొలిసారి కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రిగితే దెబ్బ ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని భావించిన కేసీఆర్ 2018లోనే ముందస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

అప్పుడు కాంగ్రెస్‌తో మాజీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు పొత్తుపెట్టుకున్నారు. తెలంగాణ‌లో బాబు వ‌చ్చి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. దీంతో అప్పుడు బాబును టార్గెట్ చేస్తూ మ‌రోసారి కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని ఉప‌యోగించారు.  ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌తి స‌భ‌లోనూ బాబుపై విమ‌ర్శ‌లు చేస్తూ తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రెండో సారి ఘ‌న విజ‌యం అందుకున్నారు.

ఇప్పుడు మోడీ..

ఇప్పుడు మ‌రోసారి కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల్ల‌కు వెళ్లార‌నే ప్రచారం సాగింది. కానీ కేసీఆర్ దాన్ని కొట్టేశారు. ఈ సారి ఆ అవ‌స‌రం లేద‌ని చెప్పిన కేసీఆర్ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు త‌మ ద‌గ్గ‌ర బ్ర‌హ్మాస్త్రం ఉంద‌ని చెప్పారు. కానీ ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తుంటే ఆ బ్రాహ్మ‌స్త్రం మ‌ళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అనే అనిపిస్తుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్రంలో పుంజుకోవాల‌ని చూస్తున్న బీజేపీని ప్ర‌ధాని మోడీని కేసీఆర్ టార్గెట్ చేశారు.  కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు అన్యాయం చేస్తుంద‌ని ఆరోపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పార్ల‌మెంట్‌లో మోడీ ఏపీ విభ‌జ‌న అన్యాయంగా జ‌రిగింద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం కేసీఆర్‌కు అనుకూలంగా మారింద‌నే అభిప్రాయాలున్నాయి. దీంతో మ‌రోసారి టీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చ‌గొడుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. బీజేపీ గెలిస్తే మ‌ళ్లీ తెలంగాణ‌, ఏపీని క‌లిపేస్తార‌న్న ప్ర‌చారాన్ని టీఆర్ఎస్ నేత‌లు ఉద్ధృతం చేశారు.

మంత్రులు త‌ల‌సాని, హ‌రీష్ రావు ప‌దే ప‌దే ఈ విష‌యంపైనే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ‌ను క‌లిపేసే ప్ర‌మాదం ఉంద‌ని ప్ర‌జ‌ల్లోకి సెంటిమెంట్‌ను మ‌ళ్లీ లేవ‌నెత్తే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని టాక్‌. మూడోసారి కూడా సెంటిమెంట్ అస్త్రంతోనే ఎన్నిక‌లకు వెళ్లాల‌ని అనుకుంటున్న కేసీఆర్ వ్యూహం ఫ‌లిస్తుందో లేదో చూడాలి.
Tags:    

Similar News